Women MLAs In Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఊహించని ఫలితాలు ప్రజలు ఇచ్చారు. రంగారెడ్డి, హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో హస్తం పైచేయి సాధించింది. ముఖ్యంగా రిజ్వర్డ్‌ స్థానాల్లో కారు జోరుకు బ్రేకులు వేసింది హస్తం. 


తెలంగాణ వ్యాప్తంగా 12 ఎస్టీ రిజ్వర్డ్‌ స్థానాలు ఉంటే ఇందులో మూడింట బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన చోట్ల కారు జోరుకు బ్రేకులు పడ్డాయి. ఆ గుర్తుపై విజయం సాధించిన వారు పరాజయం పాలయ్యారు. 


12 ఎస్సీ నియోజకవర్గాల్లో 3 మినహా మిగిలినవి బీఆర్‌ఎస్‌ జాబితాలోనే ఉండేవి. 2018 ఎన్నికలలో 6 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ నేరుగా గెలుచుకుంది. మరో ముగ్గురు సభ్యులు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు. మిగిలిన వారిలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఒక్కరు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యే ఉన్నారు. 


ఎస్టీ రిజర్వ్ స్థానాలు చూస్తే భద్రాచలం, వైరా, దేవరకొండ, ఆసిఫాబాద్‌, ములుగు, అశ్వారావుపేట, పినపాక, ఇల్లెందు, డోర్నకల్, మహబూబాబాద్, బోథ్‌, ఖానాపూర్‌లో ఈసారి కారుకు మూడే దక్కాయి. బోథ్‌, ఆసిఫాబాద్, భద్రాచలం మినహా అన్ని చోట్ల కారుకు పంక్చర్ పడింది. 


19 ఎస్సీ రిజర్వర్డ్ స్థానాల్లో చూస్తే కారు గాలి తీసింది ఈ నియోజకవర్గాలనే అని స్పష్టం అవుతుంది. చొప్పదండి, మానకొండూరు, ధర్మపురి, వికారాబాద్, జుక్కల్, తుంగతుర్తి, అందోల్, అచ్చంపేట, జహీరాబాద్‌, చేవెళ్ల, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, అలంపూర్, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్‌, బెల్లంపల్లి, వర్ధన్నపేట, సత్తుపల్లి, చెన్నూరు, మధిర, ఎస్సీ స్థానాల్లో అభ్యర్థులను నిలబెడితే రెండంటే రెండింటిలో విజయం సాధించారు. అలంపూర్‌ నుంచి విజేయుడు, స్టేషన్ ఘన్‌పూర్‌ నుంచి కడియం శ్రీహరి విజయం సాధించారు. గతంలో సత్తుపల్లి, మధిర మినహా మిగిలి స్థానాలు అన్నీ కూడా బీఆర్‌ఎస్‌ ఖాతాలో ఉండేవి. 


పెరిగిన మహిళా భాగస్వామ్యం
ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహిళల సంఖ్య పెరిగింది. 2014లో 8 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా సభలో అడుగు పెట్టారు. 2018 విషయానికి వస్తే ఆరుగురు మాత్రమే విజయం సాధించి సభకు వచ్చారు. ఇప్పుడు ఆ సంఖ్య పదికి పెరిగింది. వారిలో ఐదుగురు రెడ్డి వర్గానికి చెందిన వారైతే... ఇద్దరు ఎస్సీ, ఇద్దరు ఎస్టీ, ఒకరు బీసీ సామాజికి వర్గానికి చెందిన వాళ్లు. 


విజయం సాధించిన మహిళలు


నర్సాపూర్‌- సునీతారెడ్డి(బీఆర్‌ఎస్‌)
ఆసిఫాబాద్‌- కోవా లక్ష్మి(బీఆర్‌ఎస్‌)
మహేశ్వరం- సబితా ఇంద్రారెడ్డి(బీఆర్‌ఎస్‌)
సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌- లాస్య నందిత(బీఆర్‌ఎస్)


కోదాడ- పద్మావతి రెడ్డి(కాంగ్రెస్)
ములుగు- సీతక్క(కాంగ్రెస్)
 సత్తుపల్లి- మట్టా రాగమయి(కాంగ్రెస్)
వరంగల్ తూర్పు- కొండా సురేఖ(కాంగ్రెస్)
పాలకుర్తి- యశస్విని రెడ్డి(కాంగ్రెస్)
నారాయణపేట- చిట్టెం పర్ణికారెడ్డి(కాంగ్రెస్)