Bhadrachalam MLA Meets Revanth Reddy : హైదరాబాద్: తెలంగాణలో గత ఎన్నికల తరువాత సీన్లు మరోసారి రిపీట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. వరుసగా రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి అధికారంలోకి రాగా, విపక్ష పార్టీల నుంచి ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. తాజాగా ఎన్నికల ఫలితాలు (Telangana Election Results 2023) వచ్చిన కొన్ని గంటల్లోనే భద్రాచలం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు (Tellam Venkata Rao) టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెంట ఉన్నారు. ఎస్టీ రిజర్వుడ్ అయిన భద్రాచలం నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలుపొందారు.


అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూడటంతో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కాంగ్రెస్ లోకి జంప్ కావాలని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు యోచిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనేతల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలిశారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ ఫొటో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థులు తమతో టచ్ లో ఉన్నారని, ఫలితాలు వచ్చాక కాంగ్రెస్ లో చేరతామని చెబుతున్నారని సైతం ఇటీవల రేణుక చౌదరి సహా కొందరు హస్తం పార్టీ నేతలు చెప్పడం తెలిసిందే. 


ప్రస్తుతానికి తెల్లం వెంకట్రావ్ మాత్రమే కాంగ్రెస్ నేతలను కలుసుకోగా, మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం పార్టీ నేతలతో టచ్ లోకి వచ్చారని ప్రచారం జరుగుతోంది. వారిలో మాధరం కృష్ణారావు, వివేక్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, అరికపూడి గాంధీ ఉన్నారని హాట్ టాపిక్ అవుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ఓటమిపాలైంది. రాష్ట్రాన్ని ఇచ్చి, ప్రజల కల సాకారం చేశామని ఒక్క ఛాన్స్ కోరిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు. మొత్తం 119 స్థానాలుండగా.. కాంగ్రెస్ 64 సీట్లు కైవసం చేసుకుని మెజార్టీ నిలుపుకుంది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ 8, ఎంఐఎం 7 స్థానాల్లో నెగ్గగా, సీపీఐ పోటీ చేసిన ఒక్క స్థానంలో విజయం సాధించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 19 సీట్లు గెలిచింది, ఈసారి భారీగా పుంజుకుని మ్యాజిక్ ఫిగర్ అందుకుని ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. 
2018లో 88 స్థానాలు నెగ్గి తిరుగులేని ఆధిక్యం సాధించిన బీఆర్ఎస్ తాజా ఫలితాలలో భారీగా పతనమైంది. దాదాపు యాభై వరకు సీట్లు కోల్పోయి రెండో స్థానానికి పరిమితమైంది. బీజేపీ ఓటు బ్యాంకుతో పాటు సీట్లు సైతం పెరిగాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు నెగ్గిన బీజేపీ ఈసారి 8 మంది నేతలను అసెంబ్లీకి పంపిస్తోంది. కానీ పార్టీలో ప్రముఖ నేతలు ఓటమి కాషాయ దళాన్ని నిరుత్సాహానికి గురిచేసింది. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావ్ ఓటమి చెందారు. మరోవైపు కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తాజా ఎన్నికల్లో ఘన విజయం సాధించి అసెంబ్లీలో మరోసారి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.