Election Results 2023 News Telugu:



అదే కొంప ముంచిందట..


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయం సాధించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజల ఓటమి కాదని, ముమ్మాటికీ కాంగ్రెస్ ఓటమేనని తేల్చి చెప్పారు. I.N.D.I.A కూటమిలోని పార్టీలతో సీట్ షేరింగ్ అంశాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని అందుకే మూడు రాష్ట్రాల్లోనూ పరాభవం తప్పలేదని స్పష్టం చేశారు. పార్టీకి సిద్ధాంతం ఉంటే సరిపోదని, వ్యూహాలూ అవసరమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అయినా సీట్ల పంపకాల విషయంలో స్పష్టత వస్తే కచ్చితంగా బీజేపీని ఓడించేందుకు అవకాశాలున్నాయని ధీమా వ్యక్తం చేశారు దీదీ. 


"తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లోనూ ఆ పార్టీ గెలవాల్సింది. కానీ...I.N.D.I.A కూటమి పార్టీల అభ్యర్థుల కారణంగా ఓట్లు చీలిపోయాయి. ఇది కాంగ్రెస్‌కి నష్టం కలిగించింది. ఇదే నిజం. సీట్ల పంపకాలపై ఒప్పందం కుదుర్చుకోవాలని మేం ముందే చెప్పాం. కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఓట్లు చీలిపోవడం వల్లే కాంగ్రెస్‌ ఓడిపోయింది. పార్టీకి సిద్ధాంతం ఒక్కటే సరిపోదు. వ్యూహమూ ఉండాలి"


- మమతా బెనర్జీ,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి


ఇకపై జాగ్రత్త పడతాం..


ఇప్పటి వరకూ జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతామని స్పష్టం చేశారు మమతా బెనర్జీ. దీదీతో పాటు మరి కొందరు విపక్ష నేతలూ కాంగ్రెస్ ఓటమిపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివన్నీ సహజమేనని, తమకు ఎలాంటి బాధ లేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ వెల్లడించారు. 


"ఈ ఫలితాలపై మాకు ఎలాంటి విచారమూ లేదు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములన్నీ సహజం. బీజేపీ గెలిచినంత మాత్రాన సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్‌ అన్న నినాదం నిజమైందని అనుకోడానికి వీల్లేదు. బీజేపీతో మాకు సుదీర్ఘ యుద్ధం కొనసాగుతుంది. అలాంటి పార్టీతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కాస్త క్రమశిక్షణ అవసరం. భవిష్యత్‌లో ఎన్నికల ఫలితాలు మాకు అనుకూలంగానే ఉంటాయని భావిస్తున్నాను"


- అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీపార్టీ చీఫ్ 


 






ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ఓటమి చవి చూసింది (Election Results 2023 Updates) కాంగ్రెస్. తెలంగాణలో గెలవడం కాస్త ఊరటనిచ్చినా చేతిలో ఉన్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ని మాత్రం కోల్పోయింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ కీలక ట్వీట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఓటు షేర్‌ తేడా తక్కువగానే ఉందని లెక్కలతో సహా పోస్ట్ చేశారు.


Also Read: Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM