Telangana Assembly dissolved: హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దు అయింది. మంత్రివర్గ సిఫార్సు మేరకు ప్రస్తుత అసెంబ్లీని గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai) రద్దు చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం సర్క్యూలర్ జారీ చేశారు. కొత్త అసెంబ్లీ (తెలంగాణలో మూడో శాసనసభ) ఏర్పాటుకు ఎలక్షన్ కమిషన్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదివరకే కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించగా, తమిళిసై ఆమోదించారు. మరికొన్ని గంటల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎం ఎవరన్నది కాంగ్రెస్ కేంద్ర అధిష్టానం ప్రకటించనుంది. దాంతో సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.


అంతకుముందు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైకి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నివేదికతో పాటు, గెలిచిన అభ్యర్థులు జాబితాను అందించారు. కొద్ది సేపటి కిందటే శాసనసభ రద్దు ప్రతులను గవర్నర్ కు అందించారు అసెంబ్లీ సెక్రెటరీ నరసింహ చారి. అనంతరం శాసనసభను రద్దు చేశారు గవర్నర్ తమిళిసై. గవర్నర్ ఆమోదంతో ఎలక్షన్ కమిషన్ కొత్త అసెంబ్లీకి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ గెజిట్ ను సీఈవో వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్ గవర్నర్ తమిళిసైకి అందించారు. దాంతో తెలంగాణలో రెండో అసెంబ్లీ రద్దు అయింది. 






ఈసీ అధికారులు గవర్నర్ ను కలవడంతో... ఇక కాంగ్రెస్ నేతల బృందం సైతం తమిళిసైని కలవనుంది. కాంగ్రెస్ శాసన సభాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్ కు నివేదించనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కాంగ్రెస్ నేతల టీమ్ గవర్నర్ ను కోరతారు. సీఎల్పీ నేతను సీఎంగా ప్రకటించి ప్రమాణ స్వీకారానికి తమిళిసై ఆహ్వానించనున్నారు.