Born Baby Died Due to Pregnant Woman Delaying Admitting the Hospital in Eturunaagaram: రహదారి సక్రమంగా లేక అంబులెన్స్ రహదారిలో చిక్కుకుని ఓ నిండు గర్భిణీకి సకాలంలో వైద్యం అందలేదు. దీంతో పుట్టిన బిడ్డ కొద్ది సేపటికే మృతి చెందింది. ఈ విషాద ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో బుధవారం జరిగింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన రమ్య బుధవారం పురిటి నొప్పులతో బాధ పడుతుండగా కుటుంబ సభ్యులు 108 వాహనానికి ఫోన్ చేశారు. వారు ఏటూరునాగారం నుంచి రామన్నగూడెం మీదుగా రాంనగర్ వెళ్లారు. మార్గంమధ్యలో జీడివాగు వంతెనకు ఇరువైపులా రిటెన్షన్ గోడ నిర్మాణ పనుల కోసం మట్టి కుప్పలు పోశారు. ఈ క్రమంలో 108 సిబ్బంది అతి కష్టం మీద వాటిని దాటుతూ రాంనగర్ చేరారు. ఈ క్రమంలో రహదారి సరిగ్గా లేదని, గర్భిణీని కమలాపురానికి వెళ్లారు. అక్కడ రహదారి నిర్మాణంలో ఉండగా, పాత రోడ్డును తొలగించి కంకర వేసి దానిపై మట్టి పోశారు. అయితే, భారీ వర్షానికి రోడ్డు బురదమయం కావడంతో కొద్ది దూరం వెళ్లిన అంబులెన్స్ కూరుకుపోయింది. స్థానికంగా పొలం పనుల్లో ఉన్న రైతులు ఇది గమనించి, ఓ ట్రాక్టర్ కు అంబులెన్సుకు కట్టి లాగారు. అలాగే రోడ్డు దాటించగా, అంబులెన్సులో గర్భిణీని ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రిలో చేర్చారు.


పుట్టిన బిడ్డ మృతి


ఆస్పత్రిలో చేరిన గర్భిణీ రమ్యకు వైద్యులు అత్యవసర వైద్య సహాయం అందించగా, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ, బిడ్డ ఉమ్మనీరు తాగడంతో పుట్టిన కొద్ది సేపటికే మృతి చెందింది. అత్యవసర చికిత్స అందించినా ఆలస్యం కావడంతో ఫలితం లేకపోయిందని వైద్యులు తెలిపారు. దీంతో గర్భిణీ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. రహదారి సక్రమంగా ఉంటే తమ బిడ్డ తమకు దక్కేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.6.30 కోట్ల అంచనా వ్యయంతో ఈ మార్గంలో విస్తరణ పనులు చేపట్టారని స్థానికులు తెలిపారు. అయితే, గుత్తేదారు అలసత్వంతో పనుల్లో జాప్యం నెలకొందని, రెండేళ్లుగా సాగుతున్న రహదారి పనులు నిండు ప్రాణాన్ని కబళించాయని వాపోతున్నారు.


Also Read: Andhra News: తుపాను ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు - 2 రోజుల పాటు పర్యటన, దెబ్బతిన్న పంటలు పరిశీలన