Chandrbabu Tour in Michaung Cyclone Affected Areas: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మిగ్ జాం తుపాను (Michaung) ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పర్యటించనున్నారు. ఈ నెల 8 (శుక్రవారం) నుంచి 9 వరకూ ఆయన పర్యటన సాగనుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఆయన పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం గుంటూరు (Guntur), ప్రకాశం (Prakasam) జిల్లాలోని వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. శుక్రవారం రాత్రి బాపట్లలో బస చేసి అనంతరం శనివారం పర్చూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావంతో నీట మునిగిన , దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించనున్నారు. అనంతరం రైతులను కలిసి వారితో మాట్లాడి ధైర్యం చెప్పనున్నారు.
ప్రభుత్వంపై విమర్శలు
అంతకు ముందు ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తుపాను పట్ల అప్రమత్తంగా వ్యవహరించడంలో సర్కారు విఫలమైందని మండిపడ్డారు. ప్రజలను సకాలంలో అప్రమత్తం చేయలేదని, దీని వల్ల వర్షాలతో వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. పునరావాస కేంద్రాల్లోనూ ఆహారం, తాగునీరు సక్రమంగా అందించలేదని.. వారికి సహాయం అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తుపాను ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకూడదని, పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగిన పరిహారం అందించాలన్నారు. హుద్ హుద్, తిత్లీ వంటి తుపానుల సమయంలో టీడీపీ హయాంలో ఎలా బాధితులకు సహాయం అందించామో గుర్తు చేశారు. ప్రత్యేక జీవోల ద్వారా బాధితులకు, రైతులకు పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
బలహీన పడిన తుపాను
తీవ్ర బీభత్సం సృష్టించిన మిగ్ జాం తుపాను తీరం దాటాక కోస్తాను కుదిపేసింది. తుపాను ప్రభావంతో గుంటూరు, తిరుపతి, బాపట్ల, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి, చిత్తూరు జిల్లాలో భారీగా పంట నష్టం వాటిల్లింది. అటు ప్రకాశం నుంచి ఇటు అల్లూరి జిల్లా వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు ముంచెత్తాయి. తుపాను వాయుగుండంగా బలహీనపడి, తర్వాత అల్పపీడనంగా మారింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి విస్తరించి ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పంటకు తీవ్ర నష్టం