Telangana News: వర్షాకాలం వచ్చింది. మొదట్లో కాస్త ఆలస్యంగా వానలు కురిసినప్పడికీ.. ఆ తర్వాత భారీ వర్షాలు కురిశాయి. మళ్లీ వరుణుడు కనిపించకుండా పోయాడు. ఎండాకాలంలో మండినంత స్థాయిలో సూర్యుడు మండిపోతున్నాడు. వానాకాలం సీజన్ మూడు నెలలు గురువారం రోజుతో ముగిసిపోయాయి. దీంతో అన్నదాతలు ఆగమైపోతున్నరు. పంట సాగులో తెగ ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. జూన్ నెల వర్షాభావంతో మొదలు కాగా.. జులైలో అధిక వర్షాలు, వరదలు సాగుకు తాత్కాలికంగా ఆటంకంగా మారాయి. అయితే వర్షాలు పడినప్పుడు నిండిన వాగులు, వంకలు, చెరువుల వల్ల కొద్దో గొప్పో పంటలసాగు మొదలు అయింది. ప్రస్తుతం వరినాట్లు కూడా పూర్తి అవుతున్నాయి. మొక్కజొన్న, పత్తి వంటి ఇతర పంటలు మొలకల దశలో ఉన్నాయి. వీటికి వర్షాల అవసరం ఎక్కువగా ఉంది. కానీ ఆగస్టు నెలలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది.
సెప్టెంబర్ నెల మొదటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2వ తేదీ శనివారం రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి తదితర జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయని రైతులు సంబురపడిపోతున్నారు.
ఈ ఏడాది వర్షా కాలంలో మొత్తం అంటే 92 రోజుల్లో 43 రోజుల పాటు వర్షాలు కురిశాయి. 579.9 మిల్లీ మీటర్ల వర్షానికి గాను 642.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఇలా 12 శాతం అధిక వర్షపాతం నమోదైంది. సంఖ్యల పరంగా చూస్తుంటే వర్షం ఎక్కువగా నమోదు అయినట్లు కనిపిస్తున్నా.. ఒక నెలలో అతివృష్టి తప్పు అవసరమైన సమయాల్లో అసలు వర్షమే కురవలేదు. ఇప్పటి వరకు 13 జిల్లాల్లో మాత్రమే అధిక వర్షపాతం నమోదు అయింది. యాదాద్రి భువనగిరి, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, హన్మకొండ, జనగామ, పెద్దపల్లి, భూపాలపల్లి, వికారాబాద్, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు అయింది. నల్గొండ, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్, హైదరాబాద్, కామారెడ్డి, వనపర్తి, మహబూబాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నారాయణపేట, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం మాత్రమే నమోదు అయింది. జూన్‌లో 129.4 మిల్లీ మీటర్లకు 72.6 (44 శాతం లోటు) మిల్లీ మీటర్లకు వర్షం పడింది. జులై నెలలో 229.1 మిల్లీ మీటర్లకు గాను 489.9 మి.మీ. వర్షం పడింది. ఇది సాధారణం కంటే 114 శాతం అధికం. అలాగే ఆగస్టు నెలలో 217.4 మిల్లీ మీటర్లకు గాను 80 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఇది 63 శాతం లోటు.
గత మూడు నెలల్లో.. ఖమ్మం జిల్లాలో 15 శాతం, నల్గొండలో 14 శాతం, సూర్యాపేటలో 13 శాతం, జోగులాంబ గద్వాలలో 5 శాతం లోటు వర్షపాతం నమోదు అయింది. అతి తక్కువగా హైదరాబాద్‌లో 22 రోజులు మాత్రమే వర్షం కురిసింది. నాగర్ కర్నూల్ లో 25, రంగారెడ్డిలో 26, వనపర్తిలో 27, మహబూబ్ నగర్ 28, యాదాద్రి, వికారాబాద్‌లలో 29 రోజుల చొప్పున వర్షం పడింది. ములుగు జిల్లాలో అత్యధికంగా 47 రోజుల పాటు వర్షపాతం నమోదు అయింది. భద్రాద్రి జిల్లాలో 45 రోజులు, ఆదిలాబాద్‌లో 42 రోజుల పాటు వర్షం పడింది. రాష్ట్రంలో 612 మండలాలకు గాను 19 చోట్ల అత్యధికంగా, 228 మండలాల్లో అధికంగా, 302 మండలాల్లో సాధారణంగా వర్షం పడింది. 63 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు అయింది.