Telangana Election 2023: కాంగ్రెస్ మూడో జాబితా ఆ పార్టీలో మంటలు రేపింది. పలు నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు భగ్గుమంటున్నారు. నారాయణఖేడ్, పటాన్ చెరు, బోథ్, వనపర్తి, చెన్నూరు, పాలకుర్తి, డోర్నకల్, తుంగతుర్తి, సంగారెడ్డిలో ఆందోళనలు మిన్నంటాయి. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని, కొత్తగా చేరిన వారికి సీట్లు కేటాయించడంతో నాయకులు, కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. 


పటాన్ చెరులో ఉద్రిక్తత


తాజాగా, ప్రకటించిన మూడో జాబితాలో పటాన్ చెరు టికెట్ ను ఇటీవల బీఆర్ఎస్ నుంచి పార్టీలో చేరిన నీలం మధుకు కేటాయించడంతో, ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్ నేత కాటా శ్రీనివాస్ గౌడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన అనుచరులు ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. పట్టణంలో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి పోస్టర్లు, బ్యానర్లను కాల్చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత తొమ్మిదేళ్లుగా పార్టీకి సేవలందిస్తోన్న కాటా శ్రీనివాస్ ను కాదని మధుకు ఎలా టికెట్ ఇస్తారని ప్రశ్నించారు. ప్రలోభాలకు లోనై టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ క్రమంలో రేవంత్ ఇంటి వద్ద నిరసన తెలపగా ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు రేవంత్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్ అనుచరులను అరెస్ట్ చేశారు. 


దామోదర రాజనర్సింహ అంసతృప్తి


మరోవైపు, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ ఈ జాబితాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పటాన్ చెరు, నారాయణఖేడ్ టికెట్స్ విషయంలో ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా, నారాయణఖేడ్ టికెట్ ను సంజీవరెడ్డి ఆశించగా, సురేష్ కుమార్ షెట్కార్ కు కేటాయించారు. ఈ క్రమంలో, దామోదర అభ్యంతరం తెలుపుతున్న దామోదర పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన సన్నిహుతులు, అనుచరులతో సంప్రదింపుల అనంతరం నిర్ణయం ప్రకటిస్తారని సమాచారం. అయితే, ఆయనకు, కాంగ్రెస్ నేత మాణిక్ రావ్ థాక్రే ఫోన్ చేసి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పారు. దీనిపై స్పందించిన దామోదర, 'మీకు ఇష్టం వచ్చిన వారికి టిెకెట్లు ఇస్తే చూస్తూ ఊరుకోవాలా.?' అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తాను సూచించిన వారికి టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మాట్లాడి సెట్ చేస్తామని, దామోదరకు థాక్రే వివరించారు. 


ప్రతి జాబితాలోనూ


తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది. సామాజిక సమీకరణాలు, గెలుపు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను రంగంలోకి దించుతోంది. ఫస్ట్ లిస్టులో 55 మంది, సెకండ్ లిస్టులో 45 మంది, మూడో లిస్టులో 16 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా, బోథ్, వనపర్తిల్లో అభ్యర్థులను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. బోథ్ లో వన్నెల అశోక్ స్థానంలో గజేందర్, వనపర్తిలో చిన్నారెడ్డి స్థానంలో తూడి మేఘారెడ్డి బరిలోకి దిగుతున్నారు. కాగా, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.


Also Read: Traffic Restrictions: హైదరాబాద్ వాసులకు అలెర్ట్, ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు