Traffic Restrictions: ఎన్నికల ప్రచారంతో తెలంగాణ హోరెత్తుతోంది. బీజేపీ తరఫున ప్రచారంలో పాల్గొొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగనున్నారు. ఆ తరువాత నగరం నడిబొడ్డున ఉన్న ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. 


ప్రధాని పర్యటన వేళ నగరంలో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అధికారులు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రధాని పర్యటనకు వస్తున్న ఆ సమయంలో ఎల్బీ స్టేడియం చుట్టుపక్కన ప్రాంతాల్లో రహదారులను మూసివేయనున్నారు. అలాగే దారి మళ్లింపులు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యాలకు వెళ్లాలని సూచించారు.


ట్రాఫిక్ ఆంక్షలు ఉండే మార్గాలు
ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ జంక్షన్‌ నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు వాహననాలకు అనుమతి ఉండదు. నాంపల్లి, రవీంద్రభారతి వైపుగా వాహనాల మళ్లింపు ఉంటుంది. అబిడ్స్‌, గన్‌ఫౌండ్రి నుంచి బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. ఈ వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి నుంచి చాపల్‌ రోడ్డులోకి మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ట్యాంక్‌ బండ్‌ నుంచి బషీర్‌బాగ్‌ జంక్షన్‌ వైపు వెళ్లే వాహనాలను లిబర్టీ జంక్షన్‌ వద్ద హిమాయత్‌నగర్‌ వైపు మళ్లిస్తారు.


ఎన్టీఆర్‌, లుంబినీ పార్కులు మూసివేత
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం కోసం నగరానికి వస్తున్న వేళ మంగళవారం ఎన్టీఆర్‌ పార్కు, లుంబినీ పార్కులను మూసివేస్తున్నామని హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఆంక్షలతో సందర్శకులకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


సోమాజిగూడలోని రాజ్‌భవన్‌ నుంచి ఎల్‌బీ స్టేడియం వరకు ప్రధాని రోడ్డ మార్గంలో వెళ్తున్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు.. భద్రతా చర్యల్లో భాగంగా పార్కులను మూసి వేస్తూ హెచ్‌ఎండీఏ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.


గంటన్నర పాటు నగరంలో పర్యటన 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌ నుంచి వైమానిక దళ ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియానికి చేరుకుంటారు. 6.10 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. 6.30 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. ప్రధాని మోడీ పర్యటించనున్న ప్రాంతాల్లో పోలీసుల పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రోడ్లను ఇప్పటికే జల్లెడ పట్టేశారు. ఎల్బీ స్టేడియం పోలీసులు భారీగా మోహరించారు. 


సాయంత్రం 5.30 గంటలకు ఎల్‌బీ స్టేడియంలో బహిరంగ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి బీజేపీ నేతలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సభ విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీ సత్తా చూపించేలా జన సమీకరణ చేసేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.