Happy Birthday Trivikram: 'గురూజీ', 'మాటల మాంత్రికుడు'.. ఈ పేర్లు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. రచయితగా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. తన మార్క్ మాటలతో, ప్రాసలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడి అవతారమెత్తి అనతి కాలంలోనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లలో ఒకరిగా మారిపోయారు. ఇండస్ట్రీలో 24 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రివిక్రమ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ జర్నీలోని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.


త్రివిక్రమ్ శ్రీనివాస్ 1971 నవంబర్ 7న జన్మించారు. అతని అసలు పేరు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత 'త్రివిక్రమ్‌' అనే తన కలం పేరుతోనే ప్రాచుర్యం పొందారు. 1999లో 'స్వయంవరం' చిత్రానికి కథ-మాటలు అందించడంతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత 'సముద్రం' 'నిన్నే ప్రేమిస్తా' 'నువ్వే కావాలి' 'వాసు' వంటి సినిమాలకు మాటలు రాసిన త్రివిక్రమ్.. ఆ టైంలో 'ఒక రాజు ఒక రాణి' అనే మూవీకి లిరిసిస్ట్ గా కూడా పని చేసారనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు.


'చిరునవ్వుతో' 'నువ్వు నాకు నచ్చావ్' 'మన్మథుడు' 'మల్లీశ్వరి' 'జై చిరంజీవ' 'ఛల్ మోహన రంగ' వంటి సూపర్ హిట్ చిత్రాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ అందించారు. 'తీన్‌మార్' 'భీమ్లా నాయక్' 'బ్రో - ది అవతార్' సినిమాలకు స్క్రీన్‌ ప్లే, డైలాగ్స్ సమకూర్చారు. ఆయన రచయితగా పని చేసిన సినిమాల్లో చాలా వరకు కేవలం తన మాటలతోనే విజయ తీరాలకు చేర్చారు. 


ఇక 2022 లో 'నువ్వే నువ్వే' సినిమాతో మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ సాధించి టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయారు. ఆ తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకొని మహేష్ బాబుతో చేసిన 'అతడు', పవన్ కల్యాణ్ తో తీసిన 'జల్సా' సినిమాలు కూడా హిట్ అవ్వడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.


Also Read: 'హీరోలందరూ లైన్ వెయ్యడానికే అప్రోచ్ అవుతారని అనుకునేదాన్ని'


త్రివిక్రమ్ ఫిల్మోగ్రఫీలో 'జులాయి' 'అత్తారింటికి దారేది' 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అ ఆ' 'అరవింద సమేత వీర రాఘవ' 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలున్నాయి. అదే సమయంలో 'ఖలేజా' 'అజ్ఞాతవాసి' 'వంటి డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. కాకపొతే ఆయన దర్శకుడిగా నిరాశపరిచినా, తన మార్క్ డైలాగ్స్ తో రచయితగా మెప్పించారు. అందుకే సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే దర్శక రచయితగా కొనసాగుతున్నారు.


త్రివిక్రమ్ ఇప్పటి వరకూ 11 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ డైలాగ్ రైటర్‌గా ఆరు నంది పురస్కారాలను అందుకున్న ఆయన.. ఉత్తమ దర్శకుడిగా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సాధించారు. అలానే భారతీయ సినిమాకు చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015 లో ఆయనకు బీఎన్ రెడ్డి జాతీయ అవార్డును ప్రధానం చేసింది.


'అల వైకుంఠపురములో' సినిమా తర్వాత డైరెక్టర్​గా కాస్త గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్.. ప్రస్తుతం మహేష్ బాబుతో 'గుంటూరు కారం' అనే యాక్షన్ ఎంటర్టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినషన్​లో రాబోతున్న ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈరోజు త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్ గా 'ధమ్ మసాలా' అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నారు. 2024 సంక్రాంతికి సినిమాని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 


కుటుంబ విలువలు, బంధాలు అనుబంధాలు, ఆలోచింపజేసే మాటలు, అందమైన దృశ్యాలను సినిమా రూపంలో తెర మీద ఆవిష్కరించడంలో తనకు సాటిలేరు అనిపించుకున్నారు త్రివిక్రమ్. సినిమాల్లో ఆయన రాసే మాటలకు ఎంత క్రేజ్ ఉంటుందో, సినీ వేదికలపై మాట్లాడే మాటలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. త్రివిక్రమ్ ఎన్నో మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ 'Abp దేశం' ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది. హ్యాపీ బర్త్ డే త్రివిక్రమ్ శ్రీనివాస్...!


Also Read: 'గన్ను కన్నా ఫోన్ బాగా పేలుతుంది'.. ఇంట్రెస్టింగ్​గా 'కోట బొమ్మాళి PS' టీజర్!