Kotabommali PS Teaser : సీనియర్ నటుడు శ్రీకాంత్ మేక, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కోట బొమ్మాళి PS'. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. 'జోహార్'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న తేజ మార్ని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జీఏ2 పిక్చ‌ర్స్‌ బ్యానర్​లో రూపొందుతోన్న ఈ మూవీ రిలీజ్​కు రెడీ అయింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'లింగిడి లింగిడి' పాటకు అనూహ్య స్పందన లభించింది. ప్రమోషన్స్​లో భాగంగా మేకర్స్ తాజాగా టీజర్​ను లాంచ్ చేశారు.


ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం రూరల్ బ్యాక్ డ్రాప్​లో ఈ సినిమా తీసినట్లు టీజర్​ని బట్టి తెలుస్తోంది. సమకాలీన రాజకీయ వ్యవస్థ, పోలీసుల చూట్టూ అల్లుకున్న కథతో ఒక క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిచినట్లు అర్థమవుతోంది. ఇందులో ఎవరినీ లెక్కచేయని సిన్సియర్ పోలీసు రామకృష్ణ పాత్రలో శ్రీకాంత్ కనిపిస్తున్నారు. అతను కోట బొమ్మాళి పోలీస్ స్టేషన్​లో హెడ్ కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తుండగా, అదే స్టేషన్​లో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కూడా పని చేస్తుంటారు. అయితే ఊహించని విధంగా వీరు ముగ్గురూ ఎలక్షన్స్ కు ముందు ఏదో కేసులో ఇరుక్కుని పరారీలో ఉన్నట్లు టీజర్ లో చూపించారు. 


పరారీలో ఉన్న పోలీసులను అరెస్ట్ చేయించి ప్రజల మద్దతు కూడగట్టుకొని, మళ్లీ ఎన్నికల్లో గెలవాలని పొలిటీషయన్ మురళీ శర్మ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోట బొమ్మాళి పీఎస్ కేసును చేధించడానికి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ వరలక్ష్మి శరత్ కుమార్ రంగంలోకి దిగుతుంది. ఆ ముగ్గురిని పట్టుకోడానికి అడవులన్నీ గాలిస్తోంది. అయితే ఆమెపై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఆమె ఆ ముగ్గురిని పట్టుకుందా లేదా? అసలు కోట బొమ్మాళి పీఎస్ లో ఏం జరిగింది? ఆ ముగ్గురు పోలీసులు ఎందుకు పరారయ్యారు? వారు ఆ కేసు నుంచి బయటపడ్డారా లేదా? చివరకు ఏమైంది? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకూ ఆగాల్సిందే.



Also Read: 'ఇలాంటి వాళ్లే రేపు రేపిస్ట్​లు అవుతారు'.. అనసూయ షాకింగ్ కామెంట్స్!


మలయాళంలో హిట్టయిన 'నాయట్టు' చిత్రానికి రీమేక్ గా 'కోట బొమ్మాళి పీఎస్' తెరకెక్కుతోంది. పేరుకి రీమేక్ మూవీ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటున్నారు, పోలీసులను ఎలా బలిపశువులను చేస్తారనేది  మలయాళ వెర్షన్​లో చూపించారు. ఇక్కడ తెలుగులోనూ అదే లైన్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాకపోతే ఒరిజినల్ కంటే గ్రిప్పింగ్ గా, థ్రిల్​కు గురి చూసే ఎలిమెంట్స్​తో, రేసీ స్క్రీన్ ప్లేతో రూపొందించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.


టీజర్​లో 'గన్ను కన్నా ఫోన్ బాగా పేలుతుంది', 'ప్రజలకి తెలిసినంత రాజకీయం రాజకీయ నాయకులకు కూడా తెలియదు', 'గన్ను గవర్నమెంటుది.. వేలు మాత్రమే మనది' అంటూ వచ్చే డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. అలానే కొన్ని బూతు పదాలు కూడా వినిపించాయి. బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ సినిమా మూడ్ కు తగ్గట్టుగా బాగున్నాయి. శ్రీకాంత్, రాహుల్, శివాని, వ‌ర‌ల‌క్ష్మీ, మురళీ శర్మ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. పవన్ తేజ్ కొణిదెల, బెనర్జీ ఇతర పాత్రల్లో కనిపించారు.


'కోట బొమ్మాళి పీఎస్' చిత్రాన్ని జీఏ2 పిక్చ‌ర్స్‌ బ్యాన‌ర్‌ పై బ‌న్నీ వాసు, విద్య కొప్పినీడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాను ప్రతాప్, రియాజ్ చౌదరీ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రంజిన్ రాజ్, మిథున్ ముకుందన్ సంగీతం సమకూర్చారు. జగదీష్ చీకటి సినిమాటోగ్రఫీ అందించగా.. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చేశారు. నాగేంద్ర కాశి డైలాగ్స్ రాశారు. ఈ చిత్రాన్ని నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నారు.


Also Read: 'హీరోలందరూ లైన్ వెయ్యడానికే అప్రోచ్ అవుతారని అనుకునేదాన్ని'