CM Kcr: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM Kcr) గజ్వేల్, కామారెడ్డి (Kamareddy) నియోజకవర్గాల్లో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం గజ్వేల్ (Gazwel), మధ్యాహ్నం కామారెడ్డిలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. గజ్వేల్ లోని సమీకృత భవనంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం ప్రచారం వాహనం పై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్ కామారెడ్డి చేరుకున్న ఆయన, బీఆర్ఎస్ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. ఆయన వెంట ప్రభుత్వ విప్ గంప గోవర్థన్, సోమ భరత్ ఉన్నారు.
మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నామినేషన్
మరోవైపు, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సైతం నామినేషన్లు వేశారు. తొలుత సీఎం కేసీఆర్, తల్లి శోభ దంపతుల ఆశీర్వాదం తీసుకున్న కేటీఆర్ సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించారు. సిద్ధిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో మంత్రి హరీష్ రావు సైతం నామినేషన్ దాఖలు చేశారు. అగ్రనేతల నామినేషన్లతో ఆయా ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల సందడి నెలకొంది.
బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం
అటు, బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్సులో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆయనపై కత్తితో దాడి చేయగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మంత్రి హరీష్ రావుతో కలిసి గురువారం ఆర్డీవో కార్యాలయానికి వీల్ చైర్ లో వచ్చి నామినేషన్ వేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ ,సికింద్రాబాద్ లోని నార్త్ జోన్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నామినేషన్ వేశారు. ఈ సమయంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ కూడా అప్పుడే నామినేషన్ వేసేందుకు వెళ్లగా, పోలీసులు ముందుగా బాల్క సుమన్ వాహనాన్ని అనుమతించారు. దీంతో వివేక్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అటు, సూర్యాపేట, మహబూబ్ నగర్ లో మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి నిరంజన్ రెడ్డి ఎడ్లబండిపై రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేశారు. నామినేషన్ల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలు, పార్టీ శ్రేణుల సందడి నెలకొంది. భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారుల కార్యాలయానికి వెళ్లి అభ్యర్థులు నామినేషన్లు వేశారు.