మావోయిస్టు శ్రేణులు హీరోగా పిలుచుకునే, సెక్యూరిటీ బలగాలు ఎప్పుడెప్పుడు పట్టుకోవాలా అని తహతహలాడే మోస్ట్ వాంటెడ్‌ మావోయిస్ట్ హిడ్మా తెలంగాణ సరిహద్దుల్లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే తీవ్ర అనారోగ్యంతో  ఉన్న అతను వైద్య సహాయం కోసం ఏజెన్సీ ప్రాంతానికి వచ్చాడని, మెరుగైన వైద్య సాయం కోసం ప్రయత్నిస్తున్నాడని తెలుస్తోంది. అలాగే ఇటీవల చనిపోయిన అగ్రనేత ఆర్కే మృతిపై ఆరా తీసేందుకు కూడా వచ్చి ఉండొచ్చని మరో ప్రచారం ఉంది. 


విష ప్రయోగం జరిగిందని ప్రచారం


మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకుడు, సెంట్రల్ పొలిట్‌బ్యూర్ మెంబర్ ఆర్కే చనిపోయిన రెండు మూడు రోజులకే మరో కీలక విషయం బయటకు వచ్చింది. పార్టీలో కీలకమైన మిలటరీ ఆపరేషన్స్ నిర్వహించే హిడ్మా కూడా అనారోగ్యం బారినపడ్డట్లు తెలుస్తోంది. తీవ్రమైన అనారోగ్యంతో అతను తెలంగాణలోని అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లుగా సమాచారం. ఆర్కే మరణం అనంతరం హిడ్మాతో పాటు మరికొంత మంది మావోయిస్టు పార్టీ లీడర్లపై విషప్రయోగం జరిగినట్లు మావోయిస్టు పార్టీ సానుభూతిపరులు ఆరోపించారు. ఇప్పుడు హిడ్మా కూడా తీవ్ర అనారోగ్యంతో తెలంగాణ అటవీ ప్రాంతానికి వచ్చారన్న సమాచారం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది. ఇక్కడి నుంచి మెరుగైన వైద్య సాయం కోసం అతన్ని మరొక ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మావోయిస్ట్ పార్టీ పై కోవర్ట్ ఆపరేషన్ జరుగుతోందని మావోయిస్టు సానుభూతిపరులు ఆరోపిస్తున్నారు. తమపై విష ప్రయోగం జరిగిందన్న అనుమానంతోనే హిడ్మా బయటకు వచ్చినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. 


అసలు ఎవరీ హిడ్మా


మాడ్వీ హిడ్మా... బస్తర్ ప్రాంతం మావోయిస్టు మూవ్‌మెంట్‌కు ముఖచిత్రం లాంటివాడు. చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలోని పుర్వాటీ గ్రామంలో పుట్టాడు. పదోతరగతి వరకు చదివిన హిడ్మా చాలా చిన్న వయసులోనే ఉద్యమంలోకి అడుగుపెట్టాడు. సెంట్రల్‌ కమిటీ మెంబర్ల దగ్గర నుంచి స్టేట్ సెక్రటరీల వరకు ఎంత మంది ఉన్నా హిడ్మాకు ఉన్న క్రేజ్ వేరు.  నలభై ఏళ్ల లోపే పార్టీ కేంద్ర కమిటీలో స్థానం సాధించాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కమాండర్‌గా, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ నాయకుడిగా పనిచేశాడు. నక్సల్స్ చేసిన అతిపెద్ద అటాక్‌లుగా చెప్పుకునే దంతేవాడ, ధర్బా వ్యాలీ దాడి, సుక్మా దాడుల వెనుక ఉన్న మాస్టర్‌ మైండ్ హిడ్మా అని భద్రతా బలగాల రికార్డులు చెబుతున్నాయి. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలకు కేంద్రంగా ఉన్న దక్షిణ బస్తర్, బీజాపూర్, సుక్మా దంతెవాడ జిల్లాలలో హిడ్మా బెటాలియన్ పనిచేస్తుంది. 2010లో 76 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన తడ్‌మెట్ల దాడి, 2013 చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ నాయకత్వాన్ని తుడిచిపెట్టిన - జిరామ్ ఘాట్ దాడి, 2017లో 27 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడుల మాస్టర్ మైండ్ హిడ్మా అని భద్రతా బలగాలు అంటున్నాయి. హిడ్మాపై చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 25 లక్షలు, ఇతర సెక్యూరిటీ  ఏజెన్సీల నుంచి రూ. 20 లక్షల రివార్డు ఉంది.




ఆదివాసీలకు హీరో


మావోయిస్టు అగ్రనాయకత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన వారే. వీరంతా పార్టీని ముందుండి నడిపించారు. యాక్షన్‌ లో పాల్గొనేది మాత్రం స్థానిక ఆదివాసీలే. ఆంధ్ర, తెలంగాణలో ఉద్యమం బలహీన పడిన తర్వాత పార్టీ కేడర్‌లో ఎక్కువుగా ఉన్నవాళ్లు ఆదివాసీలే. వీళ్లకు పార్టీ నాయకత్వంతో సంబంధాలు తక్కువ. వీరిపై సైద్ధాంతిక ప్రభావం కూడా అంతగా ఉండదు. వీళ్లందరికీ హీరో హిడ్మానే. పార్టీలోని ఆదివాసీలందరికీ ప్రతినిధిగా అతను ఉన్నాడు. భారీ దాడులకు రూపకల్పన చేయడంలో సిద్ధహస్తుడైన హిడ్మాను ఆదివాసీలు ఆరాధిస్తుంటారు. 40 ఏళ్ల వయసున్న హిడ్మా సన్నని మీసంతో బక్కగా ఉంటాడు. ఎప్పుడూ AK-47తో చుట్టూ దళ సభ్యులతోనే ఉంటాడు.


భద్రతా బలగాలకు చిక్కడు-దొరకడు


సెక్యూరిటీ బలగాలు అత్యంత  తీవ్రంగా గాలిస్తున్న హిడ్మా మాత్రం పోలీసులకు చిక్కలేదు.  అనేక సందర్భాల్లో చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. అతని చుట్టూ మూడంచెల భద్రత ఉంటుంది.  ఫోన్ నెట్‌వర్క్ ఏమాత్రం అందుబాటులోలేని అసలు రోడ్డు సౌకర్యం లేని దట్టమైన అటవీ ప్రాతంలోనే అతను ఎక్కువుగా ఉంటాడు. అతని చుట్టూ ఉన్న  మావోయిస్టుల వద్ద కూడా భారీగా ఆయుధాలు ఉండటంతో అతన్ని చేరాలంటే భారీ ఆయుధ సంపత్తితో వెళ్లాల్సి ఉంటుంది. కష్టమైన నడకదారుల్లో భారీ ఆయుధాలతో వెళ్లడం కష్టం కాబట్టే సెక్యూరిటీ బలగాలు అతన్ని పట్టుకోలేకపోతున్నాయి. ఆదివాసీల్లో మంచి క్రేజ్ ఉన్న హిడ్మాను పట్టుకుని మావోయిస్టు పార్టీలోని ఆదివాసీల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని పోలీసు బలగాలు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయి.


Also Read: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. నిర్ధారించిన పార్టీ కేంద్ర కమిటీ


2017లో చనిపోయాడని వార్తలు


2017లో జరిగిన భారీ ఎన్ కౌంటర్‌లో హిడ్మా తీవ్రంగా గాయపడి చనిపోయి ఉండొచ్చని సెక్యూరిటీ బలగాలు ప్రకటించాయి. కానీ అతను ఎప్పుడూ కొత్త దాడులతో సవాల్ విసురుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఆర్కే మరణంతో మావోయిస్టులపై విషప్రయోగం జరుగుతోందనే ఆరోపణలు వచ్చాయి. హిడ్మాపై కూడా అలాగే విషప్రయోగం చేశారని అతను తీవ్ర అనారోగ్యంతో ఉన్నాడన్న సమాచారం మూడు రోజుల క్రితం బయటకు వచ్చింది. విషప్రయోగమా లేక సాధారణ అనారోగ్యమో తెలీదు కానీ హిడ్మా ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చేరాడనే సమాచారం బయటకు వచ్చింది.


Also Read: సెల్ఫీ సరదా ప్రాణాలు తీసింది... దిండి జలాశయంలో పడి ఇద్దరు యువకులు మృతి... నగరిలో యువకుడు గల్లంతు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి