ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కానీ ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ బలంగా పుందుకుందని విశ్లేషకులు అంటున్నారు. దానికి కారణం ప్రియాంక గాంధీ.
ప్రియాంక గాంధీ.. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల బాధ్యత తీసుకున్నప్పటి నుంచి హస్తం పార్టీలో జోష్ పెరిగింది. ముఖ్యంగా హథ్రాస్, లఖింపుర్ ఖేరీ వంటి ఘటనల్లో ప్రియాంక చేసిన నిరసనలు, పోరాటాలు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపాయి. ప్రస్తుతం యూపీ రాజకీయం మొత్తం ప్రియాంక చుట్టూనే తిరుగుతోంది.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అత్యంత ప్రజాకర్ష నేతగా ఉన్నారని ఆ పార్టీ నేత పీఎల్ పూనియా అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రియాంక గాంధీ సారథ్యంలోనే కాంగ్రెస్ పోటీ చేస్తుందని తెలిపారు. పూనియా ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నిక ప్రచార కమిటీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.
అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకోవడం వల్ల కాంగ్రెస్‌కు పెద్దగా నష్టమేమి లేదని పూనియా అన్నారు. ఎందుకంటే భాజపాపై విమర్శల దాడి చేయడానికి ప్రియాంక గాంధీ ముందుండి నడిపిస్తున్నారన్నారు.
భాజపా, కాంగ్రెస్ మధ్యే..
రాబోయే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా X కాంగ్రెస్ గానే ఎన్నికలు జరుగుతాయన్నారు. సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు అసలు పోటీలోనే లేవన్నారు.
ఇటీవల జరిగిన లఖింపుర్ ఖేరీ ఘటనపై ముందుగా పోరాటం చేసింది ప్రియాంక గాంధీయే అన్నారు. ఆమె పోరాటం వల్లే ఆ ఘటన దేశం మొత్తానికి తెలిసిందన్నారు. లఖింపుర్ ఖేరీ బాధితులను కలవకుండా ప్రియాంకను ప్రభుత్వం అడ్డుకున్నప్పటికీ చివరికి వారిని కలిశారన్నారు.
అంతకుముందు జరిగిన సోన్‌భద్ర, ఉన్నావ్, హథ్రాస్ ఘటనలపై కూడా ప్రియాంక గాంధీ పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యంత ప్రజాకర్షక నేత ప్రియాంక గాంధీయేనని పూనియా అన్నారు. కచ్చితంగా ఎన్నికల ప్రచారం మొత్తం ప్రియాంక చుట్టూ నడుస్తుందన్నారు.
అధిష్ఠానం నిర్ణయమేంటి?
ఉత్తర్‌ప్రదేశ్.. దేశంలో అత్యధిక పార్లమెంటు స్థానాలు కలిగిన రాష్ట్రం. ఇక్కడ విజయం సాధిస్తే దాదాపు కేంద్రంలో అధికారం సాధించినట్లేనని జాతీయ పార్టీలు భావిస్తాయి. అందుకే ఇక్కడ విజయం కోసం కాంగ్రెస్ ఎప్పటినుంచో వ్యూహాలు రచిస్తోంది. ఇందుకోసం ప్రియాంక గాంధీనే రంగంలోకి దింపింది.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై ఎప్పటికప్పుడు విమర్శల దాడి చేస్తున్నారు ప్రియాంక. కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రియాంక గాంధీ యేనని ఇప్పటికే చాలా వార్తలు వస్తున్నాయి.
ఎక్కడి నుంచి పోటీ..
ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ నిలిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేదు. అయితే ఎన్నో ఏళ్లుగా గాంధీ కుటుంబాన్ని ఆదరిస్తోన్న రాయ్‌బరేలీ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే గాంధీ కుటుంబంలో అసెంబ్లీకి పోటీపడిన తొలి వ్యక్తిగా ప్రియాంక గాంధీ నిలుస్తారు. జవహర్‌లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ప్రతి తరం సభ్యులు ఇప్పటివరకు లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేశారు.
2022 మొదట్లో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ప్రధాన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, భాజపా ప్రచారం మొదలుపెట్టాయి. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకు గాను భాజపా 312 చోట్ల విజయం సాధించింది. సమాజ్‌వాదీ పార్టీ 47, బహుజన్ సమాజ్ పార్టీ 19 స్థానాలు కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ 7 స్థానాలకే పరిమితమైంది.
Also Read: Kerala Rain Fury: కేరళలో మహా విలయం.. వర్షాలు, వరదల ధాటికి 21 మంది మృతి
Also Read: హైదరాబాద్‌లో ఉల్టా సీన్.. యువకుడి న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్ మెయిల్
Also Read: భర్త నిద్రిస్తుండగా అక్కడ వేడి వేడి నీళ్లు పోసిన భార్య