Houses for Journalists: పాత్రికేయులు అందరికీ త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ప్రక్రియను మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణకు అప్పగించామని వివరించారు. అలాగే ఢిల్లీ టీయూడబ్ల్యూజే-143 అధ్యక్షుడు నాగిళ్ల వెంకటేష్ అధ్యక్షతన శనివారం పాత్రికేయుల బృందం మంత్రి కేటీఆర్ తో సమావేశం అయింది. ఈ సందర్భంగా ఢిల్లీలో పని చేస్తున్న తెలంగాణ పాత్రికేయులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని కేటీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఈయన సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ లోని పాత్రికేయులందరికీ స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఈక్రమంలోనే ఢిల్లీలో పని చేస్తున్న తెలంగాణ పాత్రికేయుల్ని కూడా చేరుస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జీవోలో ఆ అంశాలను పొందు పరుస్తామన్నారు. జవహార్ లాల్ నెహ్రూ జర్నలిస్టు సొసైటీకీ, హైదరాబాద్ పాత్రికేయులకు ఒకేసారి ఇళ్ల స్థలాలు ఇస్తామని స్పష్టం చేశారు. భేటీలో బీఆర్ఎస్ ఎంపీలు గడ్డం రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఉన్నారు.
రెండు నెలల క్రితం జర్నలిస్టుల ధర్నా..
తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఇండ్ల స్థలాలు అందించాలనే డిమాండ్ తో బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు వివిధ జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించారు. టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష్య, కార్యదర్శులు మెడపట్ల సురేష్, షేక్ మోయిజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజహితమే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం ఇంటి స్థలాలు అందిస్తామని ఇది వరకే ప్రకటించిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై కేసీఆర్ పలుమార్లు లేవనెత్తారు. కానీ స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఈ క్రమంలో కేసీఆర్ రెండు పర్యాయాలు సీఎంగా సేవలు అందించారు. కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అంశాన్ని ప్రస్తావించారని తెలిపారు. కానీ రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిదేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇంటి స్థలాలు కేటాయింపు జరగడం లేదని పేర్కొన్నారు. దీంతో అనేక ఏండ్ల నుంచి జర్నలిస్టులు అద్దె ఇండ్లలో ఉంటూ అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి స్థలాల విషయమై ఇది వరకే జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు కూడా పలుమార్లు వినతిపత్రాలు అందించామని పేర్కొన్నారు. కానీ ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో పలుచోట్ల జర్నలిస్టులకు స్థలాలు కేటాయించారని.. ఆదిలాబాద్ జిల్లాలోనూ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు అందజేయాలని కోరారు.
ఈ దీక్షలకు ఆదిలాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినిరెడ్డి, రాష్ట్ర నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్ సుజాత, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అన్నమోల్ల కిరణ్, జిల్లా కమిటీ సభ్యుడు బొజ్జ ఆశన్న, దారుల్ హన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు అరీఫ్ ఖాన్, మద్దతు పలికి జర్నలిస్టులతో కలిసి నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.