West Indies: రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్స్. రెండుసార్లు టీ20 వరల్డ్ ఛాంపియన్స్. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఫ్రాంచైజీ లీగుల మీద  మోజు పెంచుకున్న  వెస్టిండీస్ క్రికెట్ జట్టు ఆటగాళ్లు తమ దేశాన్ని ఛాంపియన్స్‌గా కాదు కదా  కనీసం క్వాలిఫై  కూడా చేయలేకపోతున్నారు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌కు ముందు క్వాలిఫై రౌండ్ ఆడి అవమానకర రీతిలో పొట్టి ప్రపంచకప్‌కు అర్హత సాధించకుండానే వెనుదిరిగిన  విండీస్ వీరులు.. ఇప్పుడు వన్డే వరల్డ్ కప్‌కు కూడా  అర్హత సాధించేది అనుమానంగానే ఉంది.  


విండీస్‌కు జింబాబ్వే షాక్.. 


జింబాబ్వే వేదికగా ఐసీసీ నిర్వహిస్తున్న క్వాలిఫై  రౌండ్‌లో  గ్రూప్ - ఏలో భాగంగా శనివారం ఆతిథ్య జింబాబ్వే - వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 49.5 ఓవర్లలో  268 పరుగులకు ఆలౌట్ అయింది.  


జింబాబ్వే తరఫున  ఆల్ రౌండర్ సికందర్ రజా  (58 బంతుల్లో 68,  6 ఫోర్లు, 2 సిక్సర్లు), ర్యాన్ బుర్ల్ (57 బంతుల్లో 50,  5 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (58 బంతుల్ల  47, 7 ఫోర్లు) రాణించారు.  అనంతరం  మోస్తారు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  వెస్టిండీస్..  44.4 ఓవర్లలో 233 పరుగులకే పరిమితమైంది. దీంతో జింబాబ్వే 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరల్డ్ వైడ్ గా జరిగే  టీ20 లీగ్‌లలో వీరబాదుడు బాదే  విండీస్ వీరులు కీలక  మ్యాచ్‌లో చేతులెత్తేశారు.  కైల్ మేయర్స్ (72 బంతుల్లో  56, 8 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.  రోస్టన్ ఛేజ్ (53 బంతుల్లో 44,  3 ఫోర్లు)  ఫర్వాలేదనిపించాడు.  నికోలస్ పూరన్ (34), షై హోప్ (30),  బ్రాండన్ కింగ్ (20) లు విఫలమయ్యారు. జాన్సన్ ఛార్లెస్ (1), రొవ్మన్ పావెల్ (1), జేసన్ హోల్డర్ (19) లు విఫలమయ్యారు.  లక్ష్యాన్ని కాపాడుకోవడంలో జింబాబ్వే  బౌలర్లు  సమిష్టిగా రాణించారు.  ఛతర  3 వికెట్లు తీయగా. ముజర్బనీ, ఎంగ్వరలు తలా రెండు వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో రాణించిన రజా.. బౌలింగ్‌లో కూడా రెండు వికెట్లు తీసి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 


 






ఇక అదే ఆఖరు.. 


అక్టోబర్‌లో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఐసీసీ..  జింబాబ్వేలో క్వాలిఫై పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొని  సూపర్ సిక్స్ స్టేజ్‌లో టాప్ -2 గా నిలిచిన  రెండు (మొత్తం 10 టీమ్‌లకు గాను 8  జట్లు నేరుగా అర్హత సాధించాయి) జట్లు వరల్డ్ కప్‌లో మిగతా 8 టీమ్స్‌తో కలుస్తాయి.  ప్రస్తుతం  క్వాలిఫై రౌండ్‌లో లీగ్ దశ నడుస్తుండగా  జూన్ 29 నుంచి  సూపర్ సిక్సెస్  రౌండ్ ప్రారంభమవుతుంది. లీగ్ దశలో టాప్ - 3 లో ఉన్న జట్లు  రెండో రౌండ్ కు అర్హత సాధిస్తాయి.  గ్రూప్ - ఎ నుంచి జింబాబ్వే  టాప్ ప్లేస్ (6 పాయింట్లు)లో ఉండగా నెదర్లాండ్స్,  వెస్టిండీస్ లు తలా నాలుగు పాయింట్లతో   రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 


ఇక  విండీస్ తమ తర్వాతి మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌తో ఆడనుంది. రేపు (జూన్ 26)  హరారే వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్ లో గనక  నెదర్లాండ్స్.. విండీస్‌కు షాకిస్తే  కరేబియన్ టీమ్ మరో ఐసీసీ ట్రోఫీకి దూరమైనట్టే. ఈ మ్యాచ్ లో ఓడిపోయినా గెలిచినా విండీస్ సూపర్ సిక్స్ స్టేజ్‌కు వెళ్తుంది. కానీ లీగ్ దశలో పాయింట్లు  సూపర్ సిక్స్‌లో కలుస్తాయి. ఇలా చూసుకున్నా  జింబాబ్వేనే టాప్‌లో ఉంటుంది.  ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్ ను యూఎస్ఎతో ఆడాల్సి ఉంది. యూఎస్‌ఎను ఓడించడం జింబాబ్వేకు పెద్ద కష్టమేమీ కాదు.  అదీ గాన నెట్ రన్ రేట్ విషయంలో కూడా  జింబాబ్వే.. విండీస్ కంటే మెరుగ్గా ఉంది. 


ఇప్పుడు విండీస్ తక్షణ కర్తవ్యం ఏంటంటే..  లీగ్ దశలో నెదర్లాండ్స్ ను ఓడించి  సూపర్ సిక్సెస్ స్టేజ్ లో ఆడే  ప్రతీ మ్యాచ్  (3) ను గెలవాలి.  ఇదే క్రమంలో జింబాబ్వే కూడా తాము తర్వాత ఆడబోయే నాలుగు మ్యాచ్ లలో ఏదైనా ఒకదాంట్లో ఓడాలి.  అప్పుడే  వెస్టిండీస్‌కు గ్రూప్ టాపర్‌గా వెళ్లే అవకాశం ఉంటుంది.  లేదంటే ఇక విండీస్ ఆటగాళ్లకు  మళ్లీ లీగులే గతి..! అయితే  జింబాబ్వే ఇదే ఆటతీరును చివరిదాకా కొనసాగిస్తే ఆ జట్టు వన్డే వరల్డ్ కప్ ఆడటం  అసాధ్యమేమీ కాదు. 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial