తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికకు కల్వకుంట్ల కవిత మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నామినేషన్ వేశానని కవిత తెలిపారు. నిజామాబాద్ నుంచి ఆమె సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తనను గెలిపించాలని కవిత కోరారు. 90 శాతం ప్రతినిధులు తమ పార్టీలోనే ఉన్నారని, వారంతా సహకరించి గెలిపిస్తారని ఆశిస్తున్నానన్నారు. కవిత తరపున మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన కవిత వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఉన్నారు. మరోవైపు ఎంపీటీసీల ఫోరం నుంచి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ లో
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసే ముందు ఎమ్యెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, ముఖ్య నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దండే విఠల్ కు శుభాకాంక్షలు తెలిపారు. దండే విఠల్ కు మద్ధతుగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న మొదటి సెట్ నామినేషన్ దాఖలు ప్రక్రియలో పాల్గొన్నారు. మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను దండే విఠల్ దాఖలు చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేషన్లు
ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.సి.కోటిరెడ్డికి.. మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బీఫామ్ అందించారు. అనంతరరం ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన వెంట విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కె.దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు డా. లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి కలిసి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
Also Read: కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర పురస్కారం.. రాష్ట్రపతి నుంచి అందుకున్న భార్య, తల్లి
కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు
తెలంగాణలో రెండు స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ నియోజక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఏఐసీసీ ఖరారు చేసింది. మెదక్ జిల్లా నుంచి నిర్మల జగ్గారెడ్డి, ఖమ్మం నియోజకవర్గానికి రాయల నాగేశ్వర్ రావు పేర్లను ఏఐసీసీ ఖరారు చేసిందని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్-లక్డికాపుల్ లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ తరపున పట్నం మహేందర్ రెడ్డి, శంబిపూర్ రాజు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఎంపీటీసీల సంఘం తరపున ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన సంఘం నాయకులను అడ్డుకున్నారు టీఆర్ఎస్ నేతలు. వారి నామినేషన్ పత్రాలు చించివేశారు. నామినేషన్ పత్రాలను పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు చించివేశారని ఎంపీటీసీ సంఘం నాయకులు ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ కార్యాలయం ముందు జిల్లా పరిషత్ ఫోర్ లీడర్ భూపతిగళ్ళ మహిపాల్ ఆందోళనకు దిగారు. పోలీసులు సైతం కలెక్టర్ కార్యాలయంలోనికి వారిని అనుమతించకపోవడంతో వందలాది మంది రోడ్డుపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పట్నం మహేందర్ పీఏ మల్లారెడ్డి రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద వీరంగం సృష్టించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన చంద్రశేఖర్ అనే అభ్యర్థి నామినేషన్లు బలవంతంగా తీసుకుని చించివేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనను వీడియో తీస్తున్న మీడియాపై పట్నం మహేందర్ రెడ్డి పీఏ మల్లారెడ్డి దాడికి పాల్పడ్డారని మీడియా ప్రతినిధులు ఆరోపించారు.
Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్
ఖమ్మంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్
ఖమ్మం ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ తరపున తాతా మధు రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. మధు వెంట ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరుపున రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.
Also Read: ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్.. కాంగ్రెస్, బీజేపీ పోటీకి దూరం, కారణం ఏంటంటే..