తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండనున్నట్లు తేలిపోయింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఆమెకే కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం మధ్యా్హ్నం 1.30 గంటలకు ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. కవిత ప్రస్తుత శాసన మండలి సభ్యత్వం త్వరలో ముగియనుండగా.. మళ్లీ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి చూపడంలేదనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ను ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ఖరారు చేయడంతో.. ఆయన స్థానంలో కవితను పంపిస్తారనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే నిజామాబాద్ స్థానానికి సిటింగ్ ఎమ్మెల్సీ ఆకుల లలిత పేరు వినిపించింది. కానీ, టీఆర్‌ఎస్ అధిష్ఠానం ఊహాగానాలకు తెరదించుతూ నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మళ్లీ కవిత పేరునే ఖరారు చేసింది.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీజేపీ నిర్ణయించగా, కాంగ్రెస్ మాత్రం కొన్నిచోట్ల పోటీ చేయాలని, ఇంకొన్నిచోట్ల దూరంగా ఉండాలని భావిస్తోంది. నిజామాబాద్‌లో కాంగ్రెస్ ఒకవేళ పోటీ చేసినా.. సభ్యుల పరంగా టీఆర్‌ఎస్‌కు భారీ మెజారిటీ ఉండడంతో కవిత విజయం బాగా సులువు కానుంది. బల పరీక్షకు కూడా కనీసం దరిదాపుల్లో లేనప్పుడు అనవసరంగా పోటీకి దిగి మరింత బలహీన పడటం ఎందుకనే అభిప్రాయానికి కాంగ్రెస్, బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి కవితకు అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. 23వ తేదీన కవిత మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలతో కలిసి నామినేషన్ దాఖలు వేయనున్నారు.
ఓట్ల తీరిది..
ఉమ్మడి జిల్లాలో 820 ఓట్లున్నాయి. ఇందులో కాంగ్రెస్‌కు 44, బీజేపీకి 54 ఉన్నాయి. ఈ ఇద్దరివి కలిసినా వంద ఓట్లు కూడా లేవు. మిగిలిన 720 బలం టీఆర్ఎస్‌కు ఉంది. కనీసం పోటీకి దరిదాపుల్లో కూడాలేవు. దీంతో రెండు జాతీయ పార్టీలు పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. పోటీ చేసి టీఆర్ఎస్ లోకల్ బాడీ లీడర్లకు తాయిలాలు ఇప్పించేందుకు దోహపడటంతో పాటు ఉన్న పార్టీ నేతలు జంప్ కాకుండా వారికి ఖర్చు పెట్టి కాపాడుకోవడం అవసరమా..? అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: గురుకుల స్కూల్‌లో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థినులకు కొవిడ్ పాజిటివ్.. సిబ్బంది అలర్ట్
Also Read: Foods: ఎక్కువకాలం జీవించాలనుందా... అయితే ఇవి కచ్చితంగా తినండి
Also Read: ఒకే ఒక్కడు.. వెయ్యిమందిని కాపాడాడు.. కోవూరు ఎస్సైకి జనం జేజేలు