నెల్లూరు జిల్లాలో వరద తాకిడికి వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బంది పడ్డారు. బయటకు వచ్చి గమ్యస్థానాలు చేరుకోలేక కొంతమంది, ఇళ్లలోకి నీరు చేరి పునరావాస కేంద్రాల దగ్గరకు వెళ్లలేక మరికొందరు అవస్థలు పడ్డారు. ఇలాంటి వారందరికీ ఆపద్బాంధవుడిలా మారారు కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు.
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పరిధిలోని కోవూరు, సాలుచింతల సహా ఇతర ప్రాంతాల్లో ఈ దఫా వరద బీభత్సం సృష్టించింది. పెన్నాకు వరదలు వచ్చినప్పుడు కోవూరు మండలంపై ఆ ప్రభావం తక్కువగా ఉండేది. నెల్లూరు నగరం పరిధిలోని పొర్లుకట్ట, వెంకటేశ్వర పురం ఇతర ప్రాంతాలు నీటమునిగేవి కానీ, కోవూరులో ఆ ప్రమాదం తక్కువ. కానీ ఈ సారి పెన్నా వరద కోవూరుకి తీవ్ర నష్టం కలిగించింది. కోవూరు మండలం పరిధిలోని అనేక గ్రామాలు నీటమునిగాయి. ప్రజలు బిక్కు బిక్కుమంటూ ఇళ్లలో చిక్కుకుపోయారు.
ఈ దశలో కోవూరు ఎస్సై వెంకటేశ్వరరావు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలసి సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. శనివారం విధులకు వచ్చిన ఆయన, ఇంటికి వెళ్లకుండా ఆదివారం సాయంత్రం వరకు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. దాదాపుగా వెయ్యిమందిని ఆయన సురక్షిత ప్రాంతాలకు తరలించారని సమాచారం. వరదల్లో చిక్కుకుపోయిన ఐటీఐ కాలేజీ విద్యార్థులను కూడా రక్షించింది ఈయనే. 25మంది విద్యార్థులు వరదలో చిక్కుకుపోగా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎస్సై వెంకటేశ్వరరావు.
Also Read: ఓ అడుగు వెనక్కి వేసి.. మరో అవకాశం సృష్టించుకున్న జగన్ ! బిల్లుల ఉపసంహరణ వెనుక పక్కా రాజకీయ వ్యూహం !
ప్రచారానికి దూరం..
వరద బాధితులను పడవల్లో తీసుకొచ్చే విషయంలో నెల్లూరు జిల్లాలో కొంతమంది పోలీసులు ప్రచారానికి ఎంత విలువిచ్చారో కొన్ని వీడియోలు బయటపడ్డాయి. సాక్షాత్తూ సీఐ కేడర్ లోని ఓ అధికారి.. కెమెరాకు అడ్డంగా ఉన్నావంటూ కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నారు. కెమెరాకు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరికీ చీవాట్లు పెట్టారు. అయితే కోవూరు ఎస్సై కనీసం తన వెంట మీడియాని కూడా తీసుకెళ్లలేదు. తన ఫోన్ ఇచ్చి ఎవరినీ ఫొటోలు తీయమని కూడా చెప్పలేదు. ఫొటోలు కాదు ముఖ్యం, చేసే పని ముఖ్యం అనేది ఆయన ఆలోచన. అందుకే ఆయన ఎక్కడెక్కడ, ఎంతమందికి సాయం చేశాడనేది మీడియా ద్వారా బయటకు రాలేదు, కనీసం ఆ వీడియోలు కూడా లేవు.
Also Read: వర్షాలు కారణంగా శ్రీవారి దర్శనం చేసుకోలేపోయిన వారికి టీటీడీ శుభవార్త
స్థానికంగా జేజేలు..
స్థానికులు ఎస్సై వెంకటేశ్వరరావు చొరవపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యక్షంగా తమను వరదల్లో ఒడ్డుకు చేర్చారని, వందలాది మందిని ఆయన స్వయంగా పడవల్లో తీసుకొచ్చారని, వృద్ధులు, వికలాంగులు, పిల్లలకు తొలుత ప్రాధాన్యమిచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారని చెబుతున్నారు కోవూరు ప్రజలు.
Also Read: తక్కువ ధరకే బైక్ కావాలా నాయనా.. హా కావాలి.. అన్నారో అంతే.. మీ ఆశే ఆమెకి బిజినెస్