Compensation to Nampally Fire Accident Victims: నాంపల్లి అగ్ని ప్రమాద (Nampally Fire Accident) ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల (5 Lakhs Compensation) సాయం ప్రకటించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి కేటీఆర్ (KTR) ఈ మేరకు పరిహారం ప్రకటించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఇప్పటివరకూ 9 మంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు గాయపడగా, 21 మంది అపస్మారక స్థితిలో ఉన్నారు. వీరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉండగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


బాధితులకు మెరుగైన వైద్యం


నాంపల్లి ఘటనలో మృతుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాద ఘటనపై ఆరా తీసిన ఆయన, ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు, గవర్నర్ తమిళిసై కూడా ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్ ను ఆదేశించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు.


దర్యాప్తునకు ఆదేశం


ప్రమాద ఘటనపై మంత్రి కేటీఆర్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ఆయన, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. 'ప్రమాద ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిస్తాం. అస్వస్థతకు గురైన వారికి ఉస్మానియాలో మెరుగైన వైద్యం అందిస్తున్నాం. అవసరమైతే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తాం. ప్రమాదంలో ఆస్తి నష్టపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. భవనం సెల్లార్ లో రసాయనాలు నిల్వ ఉంచారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల కారణాలు వివరంగా తెలుస్తాయి. 6 నెలల కిందట అగ్ని ప్రమాదాలపై సేఫ్టీ ఆడిట్ కింద విచారణ చేయించాం. ఈ ప్రమాదంలో నివేదిక ద్వారా వివరాలు తెలుసుకుని చర్యలు చేపడతాం.' అని కేటీఆర్ వెల్లడించారు.



హైదరాబాద్ నాంపల్లి బజార్ ఘాట్ లో సోమవారం ఉదయం 9:30కు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ రసాయన గోదాంలో అగ్ని ప్రమాదం జరిగి ఐదో అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 9 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు. కొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న 15 మందిని అగ్ని మాపక సిబ్బంది రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 21 మంది అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


Also Read: Nampally Accident Deaths: నాంపల్లి అగ్ని ప్రమాదం - మృతుల వివరాలివే