Deaths in Nampally Accident: హైదరాబాద్ నాంపల్లిలోని బజార్ ఘాట్ లో సోమవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. మృతుల్లో నాలుగు రోజుల పసికందు సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో మహ్మద్ ఆజామ్ (54), మహ్మద్ హసీబుర్ రెహమాన్, రెహానా సుల్తానా (50), బీడీఎస్ డాక్టర్ తహూరా పర్హీన్ (38) , తాహూరా పర్హీన్ ఇద్దరు పిల్లలు తూభ (5), తరూభా (12), ఫైజా సమీన్ (26), జకీర్ హుస్సేన్, నిక్కత్ సుల్తానా ఉన్నట్లు గుర్తించారు. బీడీఎస్ డాక్టర్ తహూరా పర్హీన్ ఈ బిల్డింగ్ లో నివాసం ఉండరని, సెలవులు ఉండడంతో పిల్లలను తీసుకుని బంధువుల ఇంటికి వచ్చారని పోలీసులు తెలిపారు. మృతుల్లో 1, 2 ఫ్లోర్లలో ఉన్న వారే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 9 మంది మృతి చెందినట్లు వెల్లడించారు. ముగ్గురికి గాయాలు కాగా, 21 మంది దట్టమైన పొగ వ్యాపించడంతో ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారని వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


తల్లీబిడ్డను కాపాడిన రెస్క్యూ టీం


ఈ ప్రమాద ఘటనలో మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టగా అపార్ట్ మెంట్ లోని వారు, చుట్టుపక్కల భవనాల్లోని వారు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. మంటల్లో ఓ చిన్నారితో పాటు మహిళ చిక్కుకున్నారు. వీరిని అగ్ని మాపక సిబ్బంది అత్యంత ధైర్య సాహసాలతో కాపాడారు. మంటల్లో, దట్టమైన పొగలో చిక్కుకున్న ఓ మహిళను, చిన్నారిని కిటికీలో నుంచి నిచ్చెన వేసి బయటకు తీశారు. యంత్రాల సాయంతో కొందరిని రక్షించగలిగారు. మంటల ధాటికి చుట్టు పక్కల ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. ఇప్పటి వరకూ 21 మందిని ఆస్పత్రికి తరలించగా 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.


కేసు నమోదు


ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిస్తామని, బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపడతామన్నారు. ప్రమాదంలో ఆస్తి నష్టపోయిన వారికి సైతం ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో రసాయనాలు నిల్వ ఉంచారని, వీటికి మంటలు అంటుకోవడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు చెప్పారు. ప్రమాదంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించామని, పూర్తి స్థాయి నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


సీఎం, గవర్నర్ దిగ్భ్రాంతి


నాంపల్లి అగ్ని ప్రమాద (Nampally Fire Accident) ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల (5 Lakhs Compensation) సాయం ప్రకటించారు. గవర్నర్ తమిళిసై సైతం ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ ను ఆదేశించారు.


Also Read: Fire Accident In Nampally: నాంపల్లి ప్రమాదంతో అంతులేని విషాదం - మృతుల్లో 4 రోజుల పసికందు, పరారీలో భవన యజమాని