నిత్యం టోపీ పెట్టుకునే వారికి జుట్టు రాలిపోయే సమస్య వస్తుందని ఎంతోమంది నమ్ముతున్నారు. ఈ టోపీ పెట్టుకోవడం వల్ల మాడు వేడెక్కుతుందని, ఇది జుట్టు రాలడానికి దారితీస్తుందని అనుకుంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోదని వైద్యశాస్త్రం దృఢంగా చెబుతోంది. జుట్టు ఊడిపోవడానికి, బట్టతల రావడానికి ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు, హార్మోన్లలో మార్పులు ఉంటాయి. టోపీలు పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుంది అనుకోవడం కేవలం ఒక అపోహ. మాడు వేడెక్కడం వల్ల జుట్టు రాలిపోతుంది అనుకోకండి. టోపీ పెట్టుకునేది మాడు వేడెక్కకుండా ఉండడం కోసం. ఇప్పుడు వస్తున్న టోపీలు మాడుకు గాలి తగిలేలా తయారవుతున్నాయి. కాబట్టి కేవలం టోపీ పెట్టుకోవడమే జుట్టు రాలిపోవడానికి కారణం అవ్వదు. మరీ బిగుతుగా ఉండే టోపీలు వాడకపోవడమే మంచిది. ఇది గాలి ఆడకుండా చేసి కాస్త ఇబ్బందిగా అనిపించేలా చేస్తుంది. జుట్టు మూలాలు చర్మం ఉపరితలం కింద ఉంటాయి. టోపీలు వంటి బాహ్య కారకాలు ఇవి జుట్టు మూలాలను ప్రభావితం చేసే అవకాశం ఉండదు.
జుట్టు హఠాత్తుగా రాలిపోవడానికి, బట్టతల రావడానికి కుటుంబ వారసత్వం కారణంగా భావించవచ్చు. తండ్రికి బట్టతల ఉంటే కొడుక్కి వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే హార్మోన్లలో విపరీతమైన మార్పులు కూడా జుట్టు రాలడానికి కారణం అవుతాయి. కొన్ని రకాల ఆహారపు అలవాట్లు జుట్టు రాలడాన్ని ప్రేరేపిస్తాయి. ధూమపానం, మద్యపానం వంటివి జుట్టును బలహీనపడేలా చేస్తాయి. హెయిర్ ఫోలికల్స్‌కు రక్తప్రసరణ తగ్గి వాటి పెరుగుదల ఉండకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. కాబట్టి ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉంటే మంచిది.
సరైన నిద్ర లేకపోయినా ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ ఒత్తిడి వల్ల జుట్టు సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జుట్టు రాలిపోతుంది. అందుకే సమయానికి నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి వల్ల హార్మోన్ల అసమతుల్యత వస్తుంది. ఇది కూడా జుట్టు రాలిపోవడానికి కారణం అవుతుంది. నిశ్చల జీవనశైలి కూడా జుట్టు పెరగకుండా అడ్డుకుంటుంది. వ్యాయామం చేయకపోవడం వల్ల నెత్తి మీద రక్తప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. స్టెరాయిడ్స్ అధికంగా వాడడం కూడా హార్మోన్ల స్థాయిలను మార్చేస్తుంది. ఇది కూడా జుట్టు రాలడానికి దారితీస్తుంది. గర్భనిరోధక మాత్రలు వాడే వారిలో కూడా హార్మోన్లలో మార్పులు అధికంగా వస్తాయి. దీని వల్ల జుట్టు పల్చబడే అవకాశం ఉంది. వాతావరణంలో కాలుష్యం అధికంగా ఉన్నా కూడా జుట్టు పల్చబడుతుంది. కాబట్టి మీకు జుట్టు రాలిపోవడానికి వీటిలో ఏవి కారణమో తెలుసుకొని ప్రయత్నం చేయండి. థైరాయిడ్ సమస్యలు ఉన్నా కూడా ఆ వ్యాధిని అదుపులో ఉంచుకోకపోతే బట్టతల వచ్చే అవకాశం ఎక్కువ.
ఆహారం తీసుకుంటూ జుట్టును సంరక్షించుకుంటే వెంట్రుకలు ఊడిపోయే అవకాశం తగ్గుతుంది. అలాగే మాడుపై మురికి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. రసాయన చికిత్సలు తీసుకోవడం మానేయాలి. సాధారణంగా ఇంటి దగ్గరే ఆరోగ్యకరమైన పద్ధతుల్లో జుట్టును శుభ్రపరచుకొని కాపాడుకోవాలి.