Nominations Scrutiny In Telangana: తెలంగాణ ఎన్నికల్లో మరో కీలక ఘట్టం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్‌లను అధికారులు స్క్రూటినీ చేయనున్నారు. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్‌లను రిటర్నింగ్‌ అధికారులు పరిశీలించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి.


స్క్రూటినీలో భాగంగా నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరిస్తారు. ఆపై నామినేషన్‌ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఈ నెల 15 లోపు నామినేషన్‌లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. ఈ నామినేషన్‌ ఉపసంహరణ కూడా పూర్తయితే ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది కచ్చితంగా తేలనుంది. 


30న పోలింగ్
రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో నవంబర్‌ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలో మొత్తం 35,356 కేంద్రాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. త్వరలో ప్రకటించనున్న అనుబంధ జాబితాతో ఓటర్ల సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది.  


ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్‌ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. శాంతి భద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం 39 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న సుమారు 50 మందిని వ్యయ పరిశీలకులుగా నియమించింది. 


అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్‌ టీమ్‌లు, అకౌంటింగ్‌ బృందాలు, ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్, స్టాటిక్‌ సర్వైలియన్స్‌ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. 4 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. 89 పోలీసు చెక్‌పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది.  


అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఓటర్ల జాబితాలు ప్రకటన, సవరణలు చేయడం, ఈవీఎంలు సిద్ధం చేయడం, పోలింగ్‌ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది. 


దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికి మించి అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు కోరుకుంటే ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం నామినేషన్ల దాఖలు ప్రారంభానికి 5 రోజుల ముందుగానే ఎన్నికల అధికారులకు 12డీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి అర్హులందరి ఇళ్లకు వెళ్లి ఆసక్తి చూపితే 12డీ దరఖాస్తు చేయిస్తారని స్పష్టం చేసింది. 


ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగం కోసం నమోదైన దరఖాస్తులను, నియోజకవర్గ అధికారి ఆమోద ముద్రతో పోస్టల్ బ్యాలెట్ ముద్రణనుఎన్నికల సంఘానికి పంపుతారు. పోలింగ్ తేదీ కన్నా ముందే, పోలింగ్ కేంద్ర స్థాయి అధికారి బ్యాలెట్ పత్రాలు, సంబంధిత కవర్లతో ఓటర్ల ఇంటికి వెళ్తారు. అక్కడ ఓటరు రహస్యంగా తన ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రత్యేక కంపార్టుమెంట్ ఏర్పాటు చేస్తారు.