India World Cup Match List 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌లో భారత్ అప్రతిహాత విజయాలతో నాకౌట్‌ దశకు చేరింది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో మొదలైన భారత జైత్రయాత్ర నెదర్లాండ్స్‌ వరకు నిరాటంకంగా సాగింది. లీగ్‌ దశలో భారత్‌ ఆడిన తొమ్మిది మ్యాచుల్లో అన్ని ఏకపక్షంగా సాగాయంటే ఈ ప్రపంచకప్‌లో భారత్ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి భారత్‌ మ్యాచ్‌లు అవలోకనం చేసుకుంటే..

 

తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో

వరల్డ్‌కప్‌లో మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 1999 తర్వాత ఆస్ట్రేలియాను ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లోనే భారత్‌ ఓడించింది. కేఎల్ రాహుల్ (97 నాటౌట్) విరాట్ కోహ్లీ (85‌) పరుగులతో భారత్‌కు విజయం అందించారు. 

 

అఫ్గాన్‌పైన అలవోకగానే..

 ఈ ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టించిన అఫ్గానిస్థాన్‌పైనా భారత్ సునాయస విజయం సాధించింది. రెండోమ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్‌ 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 272 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా కేవలం 35 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (131: 84 బంతుల్లో, 16 ఫోర్లు, ఐదు సిక్సర్లు)తో విధ్వంసం సృష్టించాడు. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (55 నాటౌట్: 56 బంతుల్లో, ఆరు ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు. 

 

చిరకాల ప్రత్యర్థి చిత్తు

ప్రపంచకప్‌లో దాయాదుల పోరులో టీమిండియా మరోసారి పాక్‌ను చిత్తు చేసింది. గత 7 వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాక్‌పై గెలిచిన భారత్.. ఇప్పుడు కూడా అదే ఆనవాయితీ కొనసాగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ కనీసం 50 ఓవర్లు కూడా పూర్తిగా ఆడలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది.  కేవలం 36 పరుగులు మాత్రమే జోడించి చివరి 8 వికెట్లు కోల్పోయింది. అనంతరం ఈ లక్ష్యాన్ని టీమిండియా సునాయసంగా ఛేదించి మూడో విజయం నమోదు  చేసింది.

 

బంగ్లాదేశ్‌పై పోరు

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ రోహిత్‌ సేన మరో ఏకపక్ష విజయం సాధించింది.
  ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయసంగా ఛేదించింది. అ‌ద్భుత శతకంతో కోహ్లీ టీమిండియాకు మరో విజయాన్ని అందించాడు. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో విరాట్‌ 103 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా 41 ఓవరల్లో కేవలం మూడు వికెట్ల కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. 

 

కివీస్‌కు చావు దెబ్బే

ప్రపంచకప్‌లో టీమిండియా జైత్రయాత్రకు న్యూజిలాండ్‌ కూడా బ్రేక్‌ వేయలేకపోయింది. మహా సంగ్రామంలో వరుసగా అయిదో విజయం నమోదు చేసింది. 2019 సెమీస్‌లో ఎదురైన పరాజయానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 12 బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్‌ కోహ్లీ 104 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్సులతో 95 పరుగులు చేసి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 

 

డిఫెండింగ్‌ ఛాంపియన్‌కు షాకే

లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను రోహిత్ సేన మట్టికరిపించింది. బౌలర్లకు అనుకూలిస్తున్న పిచ్‌పై తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను భారత్‌ బౌలర్లు చుట్టేశారు. కేవలం 34.5 ఓవర్లలో 129 పరుగులకే బ్రిటీష్‌ జట్టు కుప్పకూలింది. దీంతో 100 పరుగుల భారీ తేడాతో రోహిత్‌ సేన ఘన విజయం సాధించింది. 

 

లంకను సునాయసంగా దాటేసి..

2023 వరల్డ్ కప్‌లో శ్రీలంకపై ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో భారత్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్ వరుసగా ఏడో మ్యాచ్‌లో విజయం సాధించింది. 

 

దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి

ఈ ప్రపంచ కప్‌లో అత్యద్భుతంగా ఆడుతున్న దక్షిణాఫ్రికాను 243 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 27.1 ఓవర్లలో కేవలం 83 పరుగులకే కుప్పకూలింది. కింగ్ విరాట్ కోహ్లీ (101 నాటౌట్: 121 బంతుల్లో, 10 ఫోర్లు) 49వ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

 

నెదర్లాండ్స్‌పైనా అదే ఊపు.. అదే గెలుపు

వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న భారత్‌.... మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ జట్టు శ్రేయస్స్‌ అయ్యర్‌, రాహుల్‌ శతకాలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 47.5 ఓవర్లలో250 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.