Shreyas Iyer Record: నెదర్లాండ్స్‌పై శ్రేయస్ అయ్యర్ అద్భుత సెంచరీ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 94 బంతుల్లో 128 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. అతని ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఈ విధంగా శ్రేయస్ అయ్యర్ ప్రత్యేక జాబితాలో చోటు దక్కించుకున్నాడు. వాస్తవానికి ప్రపంచకప్‌లో నంబర్-4 బ్యాట్స్‌మెన్‌గా సెంచరీ చేసిన మూడో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా శ్రేయస్ అయ్యర్ నిలిచాడు. ఇంతకు ముందు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ ఈ ఘనత సాధించారు. 1999 ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ సాధించాడు.


2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్
2011 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సెంచరీ మార్కును తాకాడు. చెన్నై వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్‌లో శ్రేయస్ అయ్యర్‌కి ఇదే తొలి సెంచరీ. అలాగే వన్డే ఫార్మాట్‌లో శ్రేయస్ అయ్యర్ తన అత్యుత్తమ స్కోరును నమోదు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 56 వన్డే మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ 56 మ్యాచ్‌ల్లో శ్రేయస్ అయ్యర్ నాలుగు సార్లు సెంచరీ మార్కును దాటాడు. కాగా 17 సార్లు 50కి పైగా పరుగులు చేశారు.


మరోవైపు టీమిండియా సారథి రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా 14 వేల పరుగులు పూర్తి చేసిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతకుముందు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ ఈ జాబితాలో ఉండేవారు. ఇప్పుడు రోహిత్ కూడా ఈ లిస్టులో చేరారు.


మరో రికార్డును కూడా రోహిత్ శర్మ తన పేరిట లిఖించుకున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివీలియర్స్ పేరు మీదున్న రికార్డును భారత కెప్టెన్ రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. నెదర్లాండ్స్ మ్యాచ్‌లో రోహిత్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. 2015లో డివిలియర్స్‌ ఒకే ఏడాదిలో వన్డేల్లో 58 సిక్సర్లు కొట్టాడు. రోహిత్‌ 60 సిక్సర్లతో ఈ రికార్డును బద్దలు కొట్టాడు.