వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న భారత్‌.... మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లీగ్‌ దశలోని తొమ్మిది మ్యాచ్‌లను గెలిచి.. పూర్తి ఆత్మ విశ్వాసంతో నాకౌట్‌లో అడుగు పెట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు శ్రేయస్స్‌ అయ్యర్‌, రాహుల్‌ శతకాలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 47.5 ఓవర్లలో250 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో టీమిండియా 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఏకపక్షంగా గెలిచినా నెదర్లాండ్స్‌ పోరాటం అభిమానులను ఆకట్టుకుంది.  



 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన ఆరంభం నుంచే దూకుడు మంత్రాన్ని జపించింది. శ్రేయస్స్‌ అయ్యర్‌ 84 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో శతక నాదం చేశాడు. మొత్తంగా అయ్యర్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు అయిదు సిక్సులతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు చివరి ఓవర్‌లో రెండు భారీ సిక్సులతో రాహుల్‌ కూడా సెంచరీ చేశాడు. రాహుల్‌ కేవలం 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీని అందుకున్నాడు. 102 పరుగుల వద్ద రాహుల్ వెనుదిరిగాడు. అయ్యర్‌, రాహుల్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో టీమిండియా 126 పరుగులు రాబట్టింది.



 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ-గిల్‌ భారత్‌కు అదిరే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు సరిగ్గా వంద పరుగులు జోడించారు. 11.5 ఓవర్లలోనే వంద పరుగులు జోడించిన టీమిండియా ఓపెనర్లు భారీ స్కోరుకు గట్టి పునాది వేశారు. ఆరంభంలో నెమ్మదిగా ఆడి క్రమంగా దూకుడు పెంచిన రోహిత్‌ శర్మ సెంచరీ దిశగా సాగుతున్న వేళ అవుటవ్వడంతో సరిగ్గా వంద పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్‌ 61 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రోహిత్‌ అవుటైన తర్వాత వచ్చిన కోహ్లీ గిల్‌తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అనంతరం ధాటిగా ఆడుతూ అర్ధ శతకం పూర్తి చేసిన గిల్‌ 129 పరుగుల వద్ద అవుటయ్యాడు. గిల్‌ 32 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 51 పరుగులు చేశాడు. 



 అనంతరం కోహ్లీ, శ్రేయస్స్ అయర్‌ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఈ ఇద్దరు బ్యాటర్లు చూస్తుండగానే స్కోరును 200 పరుగులకు చేర్చారు. సరిగ్గా స్కోరు 200 పరుగులు చేరాక విరాట్ వెనుదిరిగాడు. 56 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్సుతో కోహ్లీ 51 పరుగులు చేశాడు. రోహిత్‌ సరిగ్గా వంద పరుగుల వద్ద అవుటవ్వగా... కోహ్లీ సరిగ్గా 200 పరుగుల వద్ద పెవిలియన్‌ చేరాడు. అనంతరం రాహుల్‌తో జత కలిసిన శ్రేయస్స్‌ అయ్యర్ ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. రాహుల్‌, అయ్యర్‌ పోటీ పడి బౌండరీలు కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ భారీ భాగస్వామ్యంతో డచ్‌ బౌలర్లను ఊచకోత కోశారు. అయ్యర్‌ 94 బంతుల్లో 10 ఫోర్లు అయిదు సిక్సులతో 128 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్‌ కేవలం 64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సులతో సెంచరీని అందుకున్నాడు. 102 పరుగుల వద్ద రాహుల్ వెనుదిరిగాడు. భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. 



 411 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌...47.5 ఓవర్లలో250 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో ఓవర్‌లోనే డచ్‌ జట్టు తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత మాక్స్‌ ఓ డౌడ్‌, ఆకర్‌మన్‌ నెదర్లాండ్స్‌ను ఆదుకున్నారు. ఇద్దరు రెండో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. కానీ కొద్ది విరామంలోనే వీరిద్దరూ అవుటయ్యారు. కానీ భారత సంతతి  ఆటగాడు తేజ నిడమూరు అర్ధ శతకంతో రాణించాడు. తేజ 54, ఎంగ్రెల్‌ బ్రెచ్‌ 45, ఆకర్‌మన్‌ 35, మాక్స్‌ ఓ డౌడ్‌ 30 పరుగులతో రాణించడంతో నెదర్లాండ్స్‌ 200 పరుగుల మైలురాయిని దాటింది. అ తర్వాత వికెట్లు పడకపోయినా పరుగులు రావడం మందగించింది. దీంతో  47.5 ఓవర్లలో250 పరుగులకు నెదర్సాండ్‌ ఆలౌట్‌ అయింది. దీంతో 160 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 2, సిరాజ్‌ 2, కుల్‌దీప్ 2, జడేజా రెండు వికెట్లు తీశారు. కోహ్లీ, రోహిత్‌  సహా తొమ్మిది మంది బౌలింగ్ వేశారు. రోహిత్‌ ఒక వికెట్‌ కూడా సాధించాడు.