Telangana Highcourt :   కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయించడంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. కులాల వారీగా భూముల కేటాయింపును తప్పుబట్టిన కోర్టు.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో తెలంగాణ ప్రభుత్వం కమ్మ, వెలమ సంఘాలకు ఖానామెట్ లో ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించింది. దీనిపై కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి హైకోర్టులో వేసిన పిల్ పై సిజె బెంచ్ బుధవారం విచారించింది.  అణగారిన వర్గాలకు భూములు ఇస్తే అర్థ చేసుకోవచ్చునని.. కాని, బలమైన కుల సంఘాలకు భూములు ఇవ్వడం ఎందుకని బెంచ్ ప్రశ్నించింది. ఇలా భూములు కేటాయించడం కూడా ఒక విధమైన కబ్జానే అని వ్యాఖ్యానించింది. 


ఆగస్టు 2వ తేదీకి తదుపరి విచారణ వాయిదా                              


ఈ సందర్భంగా సాయిసింధు ఫౌండేషన్ కు ప్రభుత్వం కేటాయించిన భూమి రద్దును హైకోర్టు గుర్తు చేసింది. భూ కేటాయింపులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని వెల్లడించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది. 


హైటెక్ సిటికీ దగ్గరలో కమ్మ, వెలమ సంఘాలకు భూకేటాయింపు                                   


హైటెక్ సిటీ రహదారికి ఆనుకొని, ఖనామెట్ గ్రామంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (ఎన్‌ఐసి) రహదారిలో  అఖిల భారత వెలామా అసోసియేషన్‌కు కేటాయించగా, అయ్యప్ప సొసైటీకి వెళ్లే రహదారిలో కమ్మ వారి సేవా సంఘాల సమాఖ్యకు కేటాయించారు. ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి లోటిఆర్ఎస్ ప్రభుత్వ విధానంలో భాగంగా ఈ కేటాయింపులు జరిగాయి. దీనికింద హైదరాబాద్ పరిసరాల్లో భూమిని కేటాయించారు. దీంట్లో కమ్యూనిటీ హాళ్లు, ‘ఆత్మ గౌరవ భవనాలు’ నిర్మించడానికి, ఆయా వర్గాల సంక్షేమం కోసం ఇతర సౌకర్యాలను కల్పించడానికి వీలవుతుందని ప్రభు్తవం చెబుతోంది. 


పలు కుల సంఘాలకు... ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు భూములు


ఈ విధానంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఉప్పల్ బాగయత్ లేఅవుట్‌లో  25 బిసి కులాల కోసం 82.3 ఎకరాల భూమిని, కోకాపేటలో 13 బిసి కులాలకు ఇచ్చింది. ఇవి కాకుండా అదనంగా బాటా సింగారంలో మరో 40 ఉప కులాలకు కేటాయించింది. భూమిని కేటాయించడంతో పాటు, బీసీ ఆత్మ గౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ .95.25 కోట్లు మంజూరు చేసింది. అన్ని కులాలకూ కేటాయిస్తున్నట్లే వెలమ, కమ్మ సామాజికవర్గాలకు కేటాయించామని ప్రభుత్వం వాదిస్తోంది.  కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం ఆ రెండు కులాలకే కాకుండా ఇతర కులాలకు కూడా ప్రభుత్వం భూములు కేటాయించిందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.  అయితే వెనకుబడిన కులాకు  ఇవ్వడం సమర్థనీయమే కానీ.. ఉన్నత కులాలకు ఇవ్వాల్సిన ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.