TS Highcourt : ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులకు హైకోర్టులోనూ ఊరట లభించింది. లేదు. ఆధారాల్లేవని, ఏసీబీ సెక్షన్లు వర్తించవని ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. నిందితులు సైబరాబాద్ సీపీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. పోలీసుల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ప్రభుత్వ అప్పీల్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ...పోలీసుల రివిజన్ పిటిషన్‌కు అనుమతి ఇచ్చింది. నిందితుల్ని ఏ క్షణమైనా పోలీసులు అదుపులోకి తీసుకుని.. కస్టడీకి తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో నిందితులు వివరాలు చెప్పడంలో విఫలమయ్యారని హైకోర్టు భావించింది. సీపీ ఎదుట నిందితులు లొంగిపోయిన తర్వాత వారిని ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టవచ్చని హైకోర్టు తెలిపింది.
రిమాండ్ విధించేందుకు ఏసీబీ కోర్టు తిరస్కరణ
ఫామ్‌హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను ఒక రోజు తర్వాత పోలీసులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఆ రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు. నిందితులకు 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన తర్వాతే విచారించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సూచించారు. అరెస్ట్ విధానాన్ని ఏసీబీ జడ్జి తప్పుపట్టారు. పెట్టిన సెక్షన్లకు సరైన సాక్ష్యాధారాలు లేవన్నారు. ముగ్గురు నిందితుల రిమాండ్ రిజెక్ట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ లో న్యాయూమూర్తి ఎవిడెన్స్ చూస్తారు. ఈ కేసులో ఎవిడెన్స్ లేదు కాబట్టి నిందితుల రిమాండ్ రిజక్ట్ చేశారు న్యాయమూర్తి.
ట్రాప్ చేశామని.. ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని హైకోర్టులో వాదించిన పోలీసులు !
అన్ని కేసుల్లో నిందితులకు 41ఏ నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టులో జరిగిన వాదనల్లో ఏజీ వాదించారు. ఈ ముగ్గురి వెనుక పెద్దలు ఎవరో నిగ్గు తేల్చాల్సి ఉన్నదని, వీరిని రిమాండ్‌కు తరలించకపోతే సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉందన్నారు. ప్రలోభాలకు సంబంధించి ఆడియో సాక్ష్యా ధారాలు ఉన్నాయని, లోతుగా దర్యాప్తు జరిపితే తెరవెనుక సూత్రధారులు బయటకు వస్తారని చెప్పారు. కెమెరాలన్నింటినీ ముందుగానే ఏర్పాటు చేశారా ? అని ఈ సమయంలో న్యాయమూర్తి ప్రశ్నించగా, చేశామని ఏజీ బదులిచ్చారు. నలుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ముగ్గురు నిందితులు ప్రయత్నాలు చేశారనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
రెండు ఆడియోలు లీక్ - మరిన్ని బయటకు వస్తాయా ?
ఫామ్ హౌజ్ పై దాడి సందర్భంగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. తాము చెప్పినట్లుగా పార్టీ ఫిరాయిస్తే.. ఒక్కొక్కరికి రూ.100 కోట్ల చొప్పున డబ్బు ఇస్తామని, డబ్బుతో పాటు కాంట్రాక్టులు, పదవులు కూడా ఇస్తామని నిందితులు ప్రలోభపెట్టినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఈ ప్రలోభాలు బీజేపీ నుంచే వచ్చాయని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, మునుగోడులో ఓటమి భయంతో కేసీఆర్ ఈ నాటకానికి తెరలేపారని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయం కూడా హాట్ టాపిక్ అవుతోంది.