దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) ను కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. ప్రతి ఏడాది నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 'కన్నడ రాజ్యోత్సవ' పేరుతో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది పునీత్‌కు 'కర్ణాటక రత్న' (Karnataka Ratna Puneeth Rajkumar) పురస్కారం ఇవ్వనున్నారు.


ఎన్టీఆర్‌కు ఆహ్వానం!
బెంగళూరులోని విధాన సౌధలో నవంబర్ 1న 'కన్నడ రాజ్యోత్సవ' జరగనుంది. ఆ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ను కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. ఎన్టీఆర్ అంటే పునీత్‌కు ఎంతో అభిమానం. 'యువరత్న' విడుదల సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడు తారక్‌ను తన సోదరుడిగా పునీత్ పేర్కొన్నారు. పునీత్ 'చక్రవ్యూహ' సినిమాలో 'గెలియా గెలియా' పాటను ఎన్టీఆర్ పాడారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో యంగ్ టైగర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది. 


పునీత్ తండ్రికి తొలి 'కర్ణాటక రత్న'
'కర్ణాటక రత్న' (Karnataka Ratna) పురస్కారాన్ని 30 ఏళ్లుగా ఇస్తున్నారు. తొలిసారి 1992లో పురస్కారం ఇవ్వడం స్టార్ట్ చేశారు. తొలి ఏడాది ఇద్దరికి ఇచ్చారు. ఆ ఇద్దరిలో పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ ఒకరు. 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ రాజ్ కుమార్ కుమారుడు పునీత్ 'కర్ణాటక రత్న' అందుకుంటున్నారు. మరణానంతరం ఇస్తున్న పురస్కారం కావడంతో పునీత్ భార్య అశ్వినీ రేవంత్ భర్త బదులు అవార్డు అందుకోవచ్చని తెలుస్తోంది. 


సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా కన్నడ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని తెలుస్తోంది. రాజ్ కుమార్, రజనీకాంత్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. 


Also Read : గరికపాటిపై 'చిరు' సెటైర్ - మెగాస్టార్ మర్చిపోలేదుగా






కన్నడలో 'గంధాద గుడి'కి సూపర్ హిట్ టాక్!
పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా 'గంధాద గుడి' ఈ శుక్రవారం విడుదల అయ్యింది. జాతీయ పురస్కార గ్రహీత అమోఘ వర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ లభించింది. 


పునీత్ రాజ్ కుమార్ తన స్టార్‌డ‌మ్‌ పక్కన పెట్టి మరీ అమోఘ వర్షతో కలిసి 'గంధాద గుడి' సినిమా కోసం ట్రావెల్ చేశారని, కొత్త కథల కోసం అన్వేషించారని చిత్ర బృందం పేర్కొంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, స్టోరీ, ముఖ్యంగా పునీత్ నటన... అన్నీ బావున్నాయని క్రిటిక్స్ పేర్కొంటున్నారు. ఈ చిత్రానికి పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్విని నిర్మాత. కన్నడ, ఇంగ్లీష్, హిందీ భాషల్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. 


ఎన్టీఆర్ విషయానికి వస్తే... ఇటీవల జపాన్‌లో 'ఆర్ఆర్ఆర్' ప్రచార కార్యక్రమాలు ముగించుకుని ఇండియా వచ్చారు. ఆ సినిమా తర్వాత ఆయన కొత్త సినిమా ఏదీ సెట్స్ మీదకు వెళ్ళలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలో ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేసేది చెబుతారు.