Politics Trends : తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఫిరాయించేలా చేసేందుకు బేరసారాలు జరిగాయి. రూ. వందల కోట్లు ఆఫర్ చేశారని టీఆర్ఎస్.. ఆ బేరసారాలతో తమకు సంబంధం లేదని బీజేపీ వాదిస్తున్నాయి. అయితే ఈ విషయం న్యాయస్థానాల్లో తేలుతుంది. కానీ న్యాయస్థానంలో ప్రాథమికంగానే సరైన సాక్ష్యాలు లేవన్న కారణంగా నిందితులను రిమాండ్‌కు తిరస్కరించారు. ఈ విషయంలో టీఆర్ఎస్ పెద్దగా టెన్షన్ పడటం లేదు. మెల్లగా ఆడియోలు లీక్ చేస్తోంది. మరి ఇదే ఆడియోల్ని.. ఇంకా ఉన్నాయని చెబుతున్న వీడియోల్ని ఎందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం లేదనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే కోర్టులో పెట్టాల్సిన సమయంలో పెడతారని.. అంతకంటే ముందు బీజేపీ కొనుగోలు స్వామ్యాన్ని ప్రజాకోర్టులో పెట్టాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని ప్రజా కోర్టు ముందు ఉంచిన కేసీఆర్
రాజకీయాల్లో ఏం జరిగినా అంతిమంగా తీర్పు చెప్పాల్సింది ప్రజలే. రాజకీయ నేతలు తీర్పు కోరాల్సింది కూడా ప్రజాకోర్టులోనే. ఇక్కడ బీజేపీ తీరును టీఆర్ఎస్ ప్రజల ముందు ఉంచాలనుకుంది. వారిని నేరస్తులుగా చేసి.. చట్టం ముందు శిక్షించడం అనే దానికి ప్రాధాన్యం ఇచ్చినా.. ఇప్పుడల్లా జరిగేది కాదు. మన దేశంలో కోర్టు కేసులు తేలాలంటే చాలా కాలం పడుతుంది. చివరికి ఆ కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అంచనా వేయడం కష్టం. అంత కంటే ముందే ఈ విషయాలను ప్రజల ముందు ఉంచారని.. వారే నిర్ణయం తీసుకుంటారని దోషులకు శిక్ష విధిస్తారని టీఆర్ఎస్ అధినేత నమ్మకంతో ఉన్నారు. అందుకే బీజేపీ తీరును ఆయన ప్రజల ముందు వ్యూహాత్మకంగా పెడుతున్నారు. అది కూడా మాటల ద్వారా కాకుండా.. ఆడియోలు.. వీడియోల ద్వారా పెడుతున్నారు. నేరుగా సాక్ష్యాలనే ప్రజల ముందు ఉంచుతున్నారు.
కోర్టుల్లో కేసు తేలాలంటే చాలా కాలం పడుతుంది.. కానీ ప్రజలు ఇన్‌స్టంట్ శిక్ష వేయగలరు !
ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలతో డీలింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత .. ఎమ్మెల్యేల ఫిర్యాదు మేరకే కేసు నమోదు చేశామని పోలీసులు ప్రకటించినా ఎక్కువ మంది నమ్మడం లేదు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు దారి తప్పారని ఇంటలిజెన్స్ సమాచారం రావడంతోనే.. ట్రాప్ చేసి ఉంటారని నమ్ముతున్నారు. ఎమ్మెల్యేలే సమాచారం ఇచ్చి ఉండవచ్చు లేదా.. ఇంటలిజెన్స్ ద్వారా తెలుసుకుని ట్రాప్ చేసి ఉండవచ్చు.. ఏదైనా జరగవచ్చు కానీ.. అక్కడ అనైతిక రాజకీయం జరిగిందని.. ఓ పార్టీ ఎమ్మెల్యేలను మరో పార్టీ కొనే ప్రయత్నం చేసిందన్న విషయం మాత్రం ప్రజల్లోకి వెళ్లింది. దీన్నే ఎక్కువగా ప్రజల్లో మరింత చర్చ జరిగాలే చూసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నట్లుగా ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తుంది.
ఎదురుదాడి చేయలేక కంగారు పడుతున్న బీజేపీ !
రాజకీయ నాయకులు తప్పులు చేస్తే.. న్యాయస్థానాల్లో శిక్ష పడుతుందన్న భయం తక్కువగా ఉంటుంది. న్యాయవ్యవస్థ లొసుగుల్ని ఎలా ఉపయోగించుకోవాలో వారికి బాగా తెలుసు. అందుకే కళంకితులైన రాజకీయ నేతలకు శిక్షలు పడింది చాలా తక్కువ. అదీ కూడా త్వరగా శిక్షలు పడిన సందర్భాలు దాదాపుగా లేవు. కానీ ప్రజా కోర్టులో మాత్రం ఎప్పటికప్పుడు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రతీ ఐదేళ్లకు ఓ సారి ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక జరుగుతోంది. బీజేపీ విషయాన్ని పూర్తి స్థాయిలో ఎక్స్ పోజ్ చేస్తే ప్రజలే శిక్షిస్తారని టీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. చట్టం తన పని తాను చేసుకుపోయేలా చేసి.. ప్రజా కోర్టులో మాత్రం తాము ఎలా బీజేపీని దోషిగా నిలబెట్టాలో అలా రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో ఎదురుదాడి చేయలేక బీజేపీ నేతలు కంగారు పడుతున్నారు . ప్రమాణాలు చేస్తున్నారు. పార్టీ మారితే తప్పేంటని వాదిస్తున్నారు.
మొత్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు ఇష్యూ ముందుగా అసలు కోర్టులో కన్నా ప్రజా కోర్టులోనే తేలే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రజల ముందు అటు టీఆర్ఎస్.. ఇటు బీజేపీ తమ వాదనలను వినిపిస్తున్నాయి.