మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కొన్ని రోజులు బహిరంగ వేదికలపై ఎవరికి అయినా సరే ఫోటోలు ఇవ్వాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఏమో!? ఎందుకంటే... ఆయన మనసులో ఇంకా గరికపాటి నరసింహా రావు (Garikapati Narasimha Rao) ఎపిసోడ్ మెదులుతూ ఉన్నట్టు ఉంది. 'అలయ్ బలయ్'లో జరిగిన దానిని ఇంకా మర్చిపోయినట్టు లేరు. అందుకు శుక్రవారం రాత్రి జరిగిన కార్యక్రమంలో చిరు నోటి నుంచి వచ్చిన మాటలే ఉదాహరణ.


గరికపాటిపై 'చిరు' సెటైర్! 
ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు రాసిన 'శూన్యం నుంచి శిఖరాగ్రాలకు' గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. దానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ కార్యక్రమంలో ఆయనతో ఫోటోలు దిగడానికి కొంత మంది మహిళలు వేదికపైకి వచ్చారు. అప్పుడు ''ఇక్కడ వారు లేరు కదా!?'' అని చిరు అడిగారు. ఆ వారు అన్నది గరికపాటిని అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదుగా!! ఆయన ఉంటే మళ్ళీ ఫోటోలు దిగినందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తారనేది చిరు ఉద్దేశం కావచ్చు. అదీ పరోక్షంగా, సరదాగా స్పందించారు. చిరు మాటతో అక్కడ ఉన్నవాళ్లు అందరూ నవ్వుకున్నారు.


ఇప్పుడు 'చిరు' సెటైర్‌తో మరోసారి గరికపాటి ఎపిసోడ్ చర్చల్లోకి వచ్చింది. అసలు, ఆ రోజు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే... భారతీయ జనతా పార్టీ నాయకుడు, ప్రస్తుతం హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ ఏడాది నిర్వహించిన 'అలయ్ బలయ్' కార్యక్రమానికి చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అదే విధంగా గరికపాటిని కూడా ఆహ్వానించారు. గరికపాటి మాట్లాడానికి ప్రయత్నించిన సమయంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి అభిమానులు వేదికపైకి వచ్చారు. ఒకింత హడావిడి నెలకొంది. ప్రతి ఒక్కరి దృష్టి చిరంజీవిపై ఉంది. గరికపాటి మాటలను ఎవరూ పట్టించుకునే స్థితి లేదు. దాంతో ఆయన అసహనానికి గురి అయ్యారు. చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


''ఫోటో సెషన్ ఆగిపోతే నేను మాట్లాడతానండీ! లేకపోతే నేను వెళ్ళిపోతాను. నాకు ఏమీ మొహమాటం లేదు. అక్కడ ఆపేయాలి. చిరంజీవి గారూ... దయచేసి మీరు ఆపేసి ఇటు పక్కకి రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి... ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడికి రావాలి. లేకపోతే నాకు సెలవు ఇప్పించండి'' అని గరికపాటి అన్నారు. 


గరికపాటి వ్యాఖ్యలపై చర్చ అనవసరం!
గరికపాటి గురించి కొన్ని రోజుల క్రితం చిరంజీవి స్పందించారు. 'గాడ్ ఫాదర్' విడుదల తర్వాత కొంత మంది మీడియా మిత్రులు ఆయనను కలిశారు. అప్పుడు 'అలయ్ బలయ్'లో గరికపాటి ఎపిసోడ్ ప్రస్తావన వచ్చింది. ''గరికపాటి గొప్ప వ్యక్తి.  పెద్దాయన. ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదు'' అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. అయితే... అప్పటికే చిరంజీవి అభిమానులు గరికపాటి నరసింహా రావుపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ కార్యక్రమంలో 'వాల్తేరు వీరయ్య' దర్శకుడు బాబీ కొల్లి, చోటా కె నాయుడు, అనంత శ్రీరామ్ గరికపాటిపై మండి పడ్డారు. 


Also Read : ప్రకటించేస్తే పనులు చేసినట్లు కాదు - మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ సెటైర్!






''ఎవడు ప‌డితే వాడు... మాట మాటకీ, (చిరంజీవికి) స‌రిసాటి రాని వాళ్ళందరూ మాట్లాడుతుంటే... చిన్న చిరు నవ్వుతో ఆ క్ష‌ణం అలా పోయేలా ఆయన పనికి వెళ్తున్నారు. ఇదీ నిశ్శబ్ద విస్ఫోటనం అంటే!'' అని కెఎస్ రవీంద్ర (బాబీ కొల్లి) మాట్లాడారు. ''చిరంజీవి గారిపై అభిమానంతో ఫోటోలు తీసుకుంటున్నాం. ఆడెవ‌డో… మాట్లాడేవాడు మ‌హా పండితుడు. ఆయన అలా మాట్లాడొచ్చా అండీ? అది త‌ప్పు క‌దా!? అలాంటి వాడిని కూడా ఆయన (చిరంజీవి) ఇంటికి ఆహ్వానిస్తుంటే... 'మా ఇంటికి రండి' అని చెబుతుంటే... నాకు 'ఇది క‌దా సంస్కారం! ఇది క‌దా మేం నేర్చుకుంటున్నాం'' అని చోటా కె. నాయుడు మండిపడ్డారు. చిరంజీవికి గరికపాటి క్షమాపణలు చెప్పకపోతే ఆయన ప్రవచనాలను అడ్డుకుంటామని మెగా అభిమానులు పేర్కొంటున్నారు.