మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పనితీరుపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. గతేడాది జరిగిన 'మా' ఎన్నికల్లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఈ విషయం గురించి మాట్లాడారు. విష్ణు ప్రెసిడెంట్ పదవిని అలంకరించి ఏడాది మాత్రమే అయిందని.. మరో ఏడాది ఆయనకు సమయం ఉందని అన్నారు. ఎన్నికైన వాళ్లకు పనిచేసే బాధ్యత ఉంటుందని.. విష్ణు అధ్యక్షుడిగా పనిచేశారా..? లేదా..? అనేది 'మా' సభ్యులు అందరికీ తెలుసని అన్నారు. 


రీసెంట్ గా మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టి 'మా' కోసం చేసిన పనులను ప్రకటించారు. దీనిపై ప్రకాష్ రాజ్ ని ప్రశ్నించగా.. 'తొంబై శాతం పనులు చేశామని ప్రకటించడం వలన ఆ పనులు చేసినట్లు కాదు. విష్ణు పదవీకాలం మరో ఏడాది ఉంది. 'మా' కోసం ఏం చేస్తారో చూద్దాం' అని అన్నారు ప్రకాష్ రాజ్. వచ్చే ఏడాది ఎన్నికల్లో పోటీ చేస్తారా..? అనే ప్రశ్నకు 'ఇంకా సమయం ఉంది కదా.. ఆలోచిస్తాను' అని బదులిచ్చారు. 


Also Read: 'ఆదిపురుష్' సినిమాకి షాకింగ్ రన్ టైం - మూడు గంటలకు పైగానే!


ఇటీవల ప్రెస్ మీట్ లో మంచు విష్ణు ఏం మాట్లాడారంటే.. ''ఎలెక్షన్స్ సమయంలో మేము ఏమైతే ప్రామిస్ చేశామో అవి తొంబై శాతం పూర్తి చేశాము. ప్రతి ఒక్కరికీ ఇండస్ట్రీలో అవకాశాలు దక్కాలని.. నటీనటుల పేర్లతో ఒక బుక్ ప్రింట్ చేయించాం. అది యాక్టివ్ గా ఉన్న ప్రొడ్యూసర్స్ కి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే పది మందికి అవకాశాలు వచ్చాయి. సోషల్ మీడియా యాప్ కూడా రెడీ చేస్తున్నాం. మహిళల సంరక్షణ కోసం ఓ కమిటీను ఏర్పాటు చేశాము. ఈ కమిటీకి పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత కృష్ణన్ సలహాదారుగా పని చేస్తున్నారు. ఈ అసోసియేషన్ లో లైఫ్ టైమ్ మెంబర్ కావాలంటే.. హీరో, హీరోయిన్లు కనీసం రెండు సినిమాల్లో నటించి, అవి రిలీజై ఉండాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కనీసం పది సినిమాల్లో నటించి ఉండాలి. రెండు నిమిషాలపాటు సినిమాలో డైలాగ్స్ ఉంటేనే మెంబర్షిప్ ఇస్తాం. లైఫ్ మెంబర్షిప్ తీసుకున్నవాళ్లకి ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఈ అసోసియేషన్ కోసం ఫండ్స్ రైజ్ చేయబోతున్నాం. జనవరిలో ఈవెంట్ ఉంటుంది. అది ఫారెన్ లో చేయాలనుకుంటున్నాం. కొన్ని హాస్పిటల్స్, కాలేజెస్, స్కూల్స్ తో డీల్ పెట్టుకున్నాం. అందులో అసోసియేషన్ మెంబర్స్ కి డిస్కౌంట్ ఉంటుంది'' అని చెప్పుకొచ్చారు. 


నాలుగేళ్ల తరువాతే 'మా' బిల్డింగ్: 
ఇక 'మా' బిల్డింగ్ గురించి వస్తే.. ''అసోసియేషన్ మెంబర్స్ కి రెండు ఆప్షన్స్ ఇచ్చాను. సొంత డబ్బుతో ఆరు నెలల్లో కొత్త బిల్డింగ్ కడతానని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను. ప్రస్తుతం ఉన్న ఫిల్మ్ ఛాంబర్ ను పడగొట్టి అక్కడ కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అందులో స్పేస్ కొని ఇస్తాననేది రెండో ఆప్షన్. దానికి మూడు, నాలుగేళ్లు పడుతుంది. అయితే మా సభ్యులు రెండో ఆప్షన్ ఎంపిక చేసుకున్నారు'' అంటూ మంచు విష్ణు తెలిపారు.