MLA Rama Krishna Babu: టీడీపీ హయాంలోనే ఉత్తరాంధ్రకు ఎన్నో పరిశ్రమలు వచ్చాయని విశాఖ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. మూడు రాజధానుల పేరుతో... సీఎం జగన్ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. పోలీసుల అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఎమ్మెల్యే రామకృష్ణ బాబు కామెంట్లు చేశారు. పోలీసుల అరాచకాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. మీరు 16 నెలలు జైల్ లో ఉన్నారు కాబట్టి.. మమ్మల్ని జైలుకు పంపిస్తున్నారా అని ప్రశ్నించారు. ఋషికొండను పిండి చేయడానికి 92 కోట్లు ఖర్చా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పలకరిస్తే... అక్కడకి పోలీసులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ గర్జనకు సూర్య భగవానుడు కూడా సహకరించ లేదని తెలిపారు. 


రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఋషికొండకు వెళ్దామంటే.. పోలీసులు అడ్డుకున్నారని తెలిరారు. పోలీసులు ఖాకీ చొక్కాలు వేసుకున్నారా లేక వైసీపీ జెండా రంగుల దుస్తులు వేసుకున్నారా అని విమర్శించారు. ఋషికొండకు టీడీపీ నేతలు వస్తుంటే... వైసీపీకి నేతలకు దడ ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఋషికొండను బోడి కొండను చేశారని అనకాపల్లి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు బుద్దా నాగ జగదీశ్వర రావు కాచెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం ఖూనీ చేస్తోందన్నారు. టీడీపీ నేతలు ఏమైనా టెర్రరిస్టులా అని ప్రశ్నించారు. ఎక్కడ పడితే అక్కడ అడ్డుకోవడం సరైన పద్దతి కాదని సూచించారు. ఋషికొండను సందర్శించి తీరుతామని తెలిపారు. 


టీడీపీ నేతల గృహ నిర్బందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశాఖ పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఋషికొండపై ఏం కడుతున్నారో ప్రజలకు చెప్పాలని చెప్పుకొచ్చారు. వైసీపీ వైఫల్యాలను కప్పిపుచుకోవడానికే.. టిడిపి నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారన్నారు. నిర్మాణం చేయడానికి ఋషికొండే దొరికిందా అని ప్రశ్నించారు. విశాఖలో ఇంకెక్కడా చోటు లేదా అని అడిగారు. 


టీడీపీ కార్యాలయంలో వినూత్న నిరసన..


అనకొండ నోటిలో ఋషికొండ అనే పేరులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. అనకొండ సీఎం.. అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు పార్టీ ఆఫీసు చుట్టూ భారీగా మోహరించారు. టీడీపీ జిల్లా కార్యాలయంతోపాటు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. విశాఖ వెళ్తున్న శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవి కుమార్, పాలకొండ టీడీపీ ఇన్ ఛార్జీ నిమ్మక జయకృష్ణను తగరపువలస వద్ద భీమిలి పోలీసులు అడ్డుకుని స్టేషన్ కు తరలించారు.


విశాఖ టీడీపీ కార్యాలయం వద్ద సుమారు 100 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అవసరం అయితే అరెస్టులు కూడా చేసేందుకు మూడు వాహనాలను సిద్ధం చేశారు. గురువారం రాత్రి మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత తన కుటుంబ సభ్యులతో సినిమా థియేటర్ కు వెళ్లినా పోలీసుల ఆంక్షలు తప్పలేదు. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు థియేటర్ వద్దకు వచ్చారు. 


ఈ ఉదయం విశాఖలో అనిత ఇంటికి వెళ్లిన పోలీసులు... ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణిని బయటకు వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేశారు. పార్టీ కార్యాలయానికి వెళ్తున్న తమను అడ్డుకోవద్దని అనిత కోరారు. పోలీసులు అడ్డుకోవడంతో వాహనం దిగి నడుచుకుంటూ బయల్దేరిన అనిత, సంధ్యారాణిని కొద్ది దూరం అనుసరించిన పోలీసులు.. ఆ తర్వాత బలవంతంగా వాళ్లను అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రుషికండ పరిరక్షణ కోసం సీఎం జగన్ పోలీసులను వినియోగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆమె మండిపడ్డారు. అంతే కాకుండా రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.