తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.  కొత్తగా చేరిన వారితో పాటు ప్రస్తుతం పనిచేస్తున్నవారికి పదోన్నతల విషయంలో ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ జీవో సోమవారం నుంచి అమలుల్లో వచ్చింది. ప్యానల్‌ ఇయర్‌ తో సంబంధం లేకుండా తదుపరి నిబంధనలతో ఆదేశాలు జారీ చేసేవరకు ఈ జీవో అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర, సబార్డినేట్‌ల సేవా నిబంధనలు-1996ను సవరించినట్లు ప్రభుత్వం తెలిపింది. 


తదుపరి ఆదేశాల వరకు అమల్లో


ప్రస్తుత సేవా నిబంధనల మేరకు పదోన్నతుల కనీస అర్హత మూడేళ్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ, అధికారుల సంఘాల వినతి మేరకు సీఎం కేసీఆర్ 2018లో ఈ పరిమితిని రెండేళ్లకు తగ్గించేందుకు అంగీకారం తెలిపారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వులు ఇచ్చింది. పదోన్నతుల జీవోకు ఏడాది గడువు విధించారు. ఈ ఏడాది ఆరంభంలో ఉద్యోగ సంఘాల  వినతితో గత జనవరి 11న మరోసారి రెండేళ్ల సర్వీసుతోనే పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.  ఆగస్టు వరకు గడువు ఇచ్చారు. ఈ గడువు ముగుస్తుండడంతో మరోసారి ఉద్యోగ సంఘాలు సీఎం కేసీఆర్‌ను కలసి పదోన్నతుల కనీస అర్హతను రెండేళ్లకు కుదిస్తూ గడువుతో సంబంధం లేకుండా శాశ్వతంగా వర్తించేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. దీనిపై సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్‌కు ఆదేశాలిచ్చారు. తదుపరి ఆదేశాల జారీ చేసే వరకు పదోన్నతులకు కనీస సర్వీసు రెండేళ్ల నిబంధన అమల్లో ఉంటుందని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. 


ఎనిమిది జిల్లాలకు నూతన కలెక్టర్లు


తెలంగాణ‌ ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మొత్తం 14 మంది ఐఏఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ సీఎస్ సోమ‌వారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటి వరకు ప‌లు శాఖ‌లకు సార‌థ్యం వ‌హించిన సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి అనితా రామ‌చంద్రన్ ను రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ కార్యదర్శిగా నియ‌మించింది. ఎనిమిది జిల్లాల‌కు నూతన క‌లెక్టర్లు నియ‌మితుల‌య్యారు. 
బదిలీ అయిన అధికారులు



  • టీఎస్పీఎస్సీ కార్యద‌ర్శి: అనితా రామ‌చంద్రన్‌

  • వ్య‌వ‌సాయ‌శాఖ కార్యద‌ర్శి: ర‌ఘునంద‌న్

  • వికారాబాద్ జిల్లా క‌లెక్టర్ : నిఖిల‌

  • వ‌రంగ‌ల్ జిల్లా క‌లెక్టర్: బీ గోపి

  • రాజ‌న్న సిరిసిల్ల క‌లెక్టర్: అనురాగ్ జ‌యంతి

  • నాగ‌ర్ క‌ర్నూల్ క‌లెక్టర్: పీ ఉద‌య్ కుమార్‌

  • జోగులాంబ గ‌ద్వాల్ క‌లెక్టర్: వ‌ల్లూరు క్రాంతి

  • కామారెడ్డి క‌లెక్టర్: జితేశ్ వీ పాటిల్‌

  • మ‌హ‌బూబాబాద్ క‌లెక్టర్: కే శ‌శాంక‌

  • జ‌న‌గామ క‌లెక్టర్: జీహెచ్ శివ‌లింగ‌య్య

  • యువ‌జ‌న స‌ర్వీసుల శాఖ డైరెక్టర్‌: వీ వెంక‌టేశ్వర్లు

  • పంచాయ‌తీరాజ్ శాఖ క‌మిష‌న‌ర్‌: శ‌ర‌త్‌

  • ప‌రిశ్రమ‌ల శాఖ సంచాల‌కులు: కృష్ణ భాస్కర్‌

  • మైనారిటీ సంక్షేమ‌శాఖ కార్యద‌ర్శి: అబ్దుల్ అజీం


 


Also Read: KCR Delhi Tour: తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. రేపటి నుంచి మూడు రోజులపాటు బిజీబిజీగా గులాబీ బాస్..