తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, ప్రాజెక్టుల నిర్మాణాలు లాంటి వివాదాలు నెలకొన్న నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్‌ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


టీఆర్ఎస్ ద్విదశాబ్ధి (20 ఏళ్ల వేడుకలు) ఉత్సవాల్లో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ మూడు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 1న  బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకోనున్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించడానికి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో టీఆర్ఎస్ ఆఫీసు నిర్మాణం కోసం 1,300 గజాల మేర కేంద్రం కేటాయించడం తెలిసిందే. సెప్టెంబర్ 2న మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. అనంతరం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. టీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం పార్టీ ఆఫీసు శంకుస్థాపనకు హాజరు కానున్నారు.


Also Read: TS Schools Reopen: పిల్లలు బ్యాగులకు పట్టిన దుమ్ము దులుపుతారా..? స్కూల్స్ రీ ఓపెన్ పై తల్లిదండ్రుల మాటేంటి?


తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న షెడ్యూల్.. 


- సీఎం కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించ‌నున్నారు. సెప్టెంబర్ 1 నుంచి 3వ తేదీ వరకు ఆయన ఢిల్లీలో పర్యటిస్తారు
- సెప్టెంబ‌ర్ 1న మ‌ధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌త్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి పయనం కానున్నారు.
- ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యానికి సెప్టెంబర్ 2న మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు భూమి పూజ చేయ‌నున్నారు. 
- ఢిల్లీలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ సమీపంలో కేంద్రం ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణానికి చేపట్టిన స్థలంలో భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతాయి.
- ఢిల్లీలో పార్టీ ఆఫీసు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొననున్నారు.
- సెప్టెంబ‌ర్ 3న మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ హైద‌రాబాద్‌కు తిరిగి బ‌య‌లుదేరనున్నారు.
Also Read: Gold-Silver Price: గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇలా..

కృష్ణానది జలాల పంపిణిపై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని.. మరోసారి పునరాలోచించాలని సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కోరతారని తెలుస్తోంది. రాష్ట్రంలో పెండింగ్‌లో పలు సమస్యలపై కేంద్ర మంత్రులతో భేటీ అయి చర్చించనున్నట్టు సమాచారం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్ర షెఖావత్‌, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఎవరితో భేటీ అవుతారనే దానిపై అధికారిక వర్గాలు నేడు వెల్లడించే అవకాశం ఉంది.