టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో సుమిత్‌ అంటిల్‌ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సుమిత్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు. "నీ ప్రదర్శనతో దేశానికి కీర్తి తెచ్చావు. ఈ విజయంతో భారతదేశ యువత నీ నుంచి అద్భుతమైన స్ఫూర్తిని పొందుతారు. నీ రికార్డు విజయంతో దేశం గర్వపడుతోంది. ఇలాగే భవిష్యత్తులోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి అని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమిత్‌ అంటిల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 






సుమిత్‌ అంటిల్‌కు సీఎం జగన్‌ అభినందనలు


టోక్యో పారాలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోలో స్వర్ణం సాధించిన సుమిత్‌ అంటిల్‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. '' పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించినందుకు సుమిత్‌కు శుభాకాంక్షలు. నీ స్వర్ణంతో దేశానికి ఒకేరోజు రెండు బంగారు పతకాలు రావడం ఆనందం కలిగించింది. జావెలిన్‌ త్రోలో మూడు ప్రయత్నాల్లోనూ అద్బుత ప్రదర్శన చేసి కొత్త రికార్డు సృష్టించావు. నీ కెరీర్‌ ఇలాగే ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా'' అంటూ జగన్‌ ట్వీట్‌ చేశారు.







ఇక టోక్యో పారాలింపిక్స్‌లో మెన్స్ జావెలిన్ త్రో ఎఫ్64 విభాగంలో పోటీపడిన భారత పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ వరల్డ్ రికార్డు త్రోలతో గోల్డ్ మెడల్ సాధించాడు. తన మొదటి ప్రయత్నంలోనే 66.95 విసిరి ప్రపంచ రికార్డు సృష్టించిన సుమిత్, రెండో ప్రయత్నంలో ఏకంగా 68.08 మీటర్లు విసిరి తన రికార్డును తానే అధిగమించాడు. ఐదో ప్రయత్నంలో ఈటెను ఏకంగా 68.55 మీటర్లు విసిరి సరికొత్త చరిత్ర సృష్టించాడు.