IPLలో కోహ్లీ జట్టుకి మరో షాక్. RCBలో కీలక ఆటగాళ్లలో ఒకడైన వాషింగ్టన్‌ సుందర్‌ ఐపీఎల్‌ రెండో దశకు పూర్తిగా దూరమయ్యాడు. అతడి స్థానంలో ఆకాశ్‌దీప్‌‌ని భర్తీ చేసినట్లు RCB ప్రకటించింది. 






సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్‌ రెండో దశ ప్రారంభంకానుంది. ఇప్పటికే కొన్ని జట్లు దుబాయ్‌ చేరుకొని క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నాయి. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇంకా యూఏఈకి వెళ్లలేదు. రెండు లేదా మూడు రోజుల్లో RCB అక్కడికి బయల్దేరే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ జట్టుకు విదేశీ క్రికెటర్లు, కోచ్‌ దూరమైన సంగతి తెలిసిందే. శ్రీలంక నుంచి దుష్మంత చమీరా, హసరంగను ఆర్‌సీబీ తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో కోచ్‌ సైమన్‌ కటిచ్‌ దూరమవ్వడంతో క్రికెట్‌ డైరెక్టర్‌ హెసెన్‌ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. 






సుందర్ ఇంగ్లాండ్‌‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీసుకు ఎంపికయ్యాడు. కానీ, అక్కడికెళ్లిన తర్వాత సుందర్‌ చేతి వేలికి గాయమైంది. దీంతో అతడు తిరిగి భారత్‌కు వచ్చేశాడు. ఇప్పటికీ అతడు కోలుకోకపోవడంతో అతడు ఐపీఎల్‌కు దూరమవుతున్నాడని సమాచారం.






సుందర్‌ స్థానంలో ఆర్‌సీబీ ఆకాశ్‌దీప్‌ అనే బౌలర్‌ను ఎంచుకుంది. బెంగాల్‌ యువ క్రికెటరైన ఆకాశ్ ప్రస్తుతం ఆర్‌సీబీలో నెట్‌ బౌలర్‌గా సేవలు అందిస్తున్నాడు. సుందర్ RCB జట్టులో అటు బౌలర్‌గా ఇటు బ్యాట్స్‌మన్‌గా అదరగొట్టేవాడు. పవర్‌ప్లేలో బౌలింగ్‌ చేయడంలో అతడే మేటి స్పిన్నర్‌.