RRR Pre-Benefit Shows : అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న "ఆర్ఆర్ఆర్" ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చాయి. ఐదు షోలకు కూడా అంగీకరించాయి. చిత్ర బృందం, ప్రేక్షకుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం ఐదు థియేటర్ లలో స్పెషల్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ లోని ఐదు థియేటర్లలలో స్పెషల్ షోలకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలోని మల్లికార్జున(కూకట్‌పల్లి), భ్రమరాంబ(కూకట్‌పల్లి), విశ్వనాథ్‌(కూకట్‌పల్లి), అర్జున్‌ (కూకట్‌పల్లి), శ్రీరాములు(మూసాపేట) థియేటర్లకు మాత్రమే ఉదయం 7 గంటల కన్నా ముందు షో వేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పర్మిషన్ 25వ తేదీకి మాత్రమే పరిమితం. ఈ థియేటర్లలో తప్ప మిగతా చోట్ల ఇంకెక్కడైనా సినిమాను నిర్ణీత సమయాల కన్నా ముందుగా ప్రదర్శిస్తే పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం పేర్కొంది. 



సినిమా టికెట్ల పెంపునకు అనుమతి


ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్ల పెంచుకునేందు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎయిర్ కండీషన్డ్ థియేటర్లు(AC Theatre) ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ల రేట్లపై మొదటి మూడు రోజులు (మార్చి 25-27 వరకు) అదనంగా రూ. 50 పెంచుకోవచ్చని తెలిపింది. మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు టికెట్ల రేట్లపై అదనంగా రూ.30 పెంచుకోడానికి అనుమతి ఇచ్చింది. ఐమాక్స్(IMAX), మల్లీప్లెక్స్, సింగిల్ థియేటర్లలోని రిక్లైనర్ సీట్లకు మొదటి మూడు రోజులు అదనంగా రూ.100 పెంచుకోవచ్చని, మార్చి 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు రూ. 50 పెంచుకోవచ్చని తెలిపింది. నాన్ ఏసీ థియేటర్లలో టికెట్ల రేట్లలో మార్పులు లేవని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమాకు మొదటి పది రోజులు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 1 వరకు చిత్ర ప్రదర్శన చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసులు అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని తెలిపింది. పన్నుల మినహాయింపులు, అనుమతులు తాత్కాలికమని ప్రభుత్వం తెలిపింది. 


ఏపీలో టికెట్ల రేట్లు పెంపు


ఆర్.ఆర్.ఆర్ మూవీ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ పేరిట జీవో విడుదల అయింది. సినిమా రిలీజ్ అయ్యే ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక ధరలు అమలు చేసుకోవచ్చని ప్రభుత్వం జీవోలో వివరించింది. టిక్కెట్ ధరలకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలని  ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.