తెలంగాణలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు మరోసారి పెరిగేందుకు రంగం సిద్ధం అవుతోంది. వ్యవసాయ భూములు సహా, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల వంటి ఆస్తుల మూల మార్కెట్‌ విలువల్ని సవరించాలని ప్రభుత్వం మళ్లీ నిర్ణయించింది. కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రాథమిక సమాచారం మేరకు.. వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువల్ని 50 శాతం, ఓపెన్ ప్లాట్ల విలువను 35 శాతం, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల విలువను 25 శాతం చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి నాలుగైదు రోజుల్లో ఆర్డీవోల నేతృత్వంలోని కమిటీలు కొత్త మార్కెట్‌ విలువల్ని ఖరారు చేయాలని చేస్తాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమల్లోకి వచ్చేలా ఈలోపు ప్రక్రియ పూర్తి చేయాలని రిజిస్ట్రేషన్‌ శాఖ భావిస్తోంది.


ఏడు నెలల్లోనే రెండోసారి పెంపు
గత ఏడాది జులైలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచారు. జులై 22 నుంచి పెంచిన భూముల విలువ, పెరిగిన రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు అమలులోకి వచ్చాయి. అయితే, ఏడు నెలల్లోనే మళ్లీ ఆ ధరలను పెంచడం ప్రాధాన్యం సంతరించుకుంది. అప్పుడు వ్యవసాయ భూముల కనీస ధర ఎకరం రూ.75 వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా తక్కువ విలువ ఉన్న చోట భూమి మార్కెట్‌ రేటును 50 శాతం పెంచగా.. మధ్యశ్రేణి భూముల విలువను 40 శాతం, ఎక్కువ విలువ ఉన్న భూమి ధరను 30 శాతం వరకూ పెంచింది.


ఓపెన్ ప్లాట్ల విషయంలో చదరపు గజానికి కనీస ధర రూ.200గా నిర్ణయించారు. వీటి విలువను కూడా కనిష్ఠ ధర ఉంటే 50 శాతం, మధ్యస్థంగా ఉంటే 40 శాతం, మరీ ఎక్కువ ధర ఉంటే 30 శాతంగా పెంచారు. ఇక అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు కనీస ధర రూ.వెయ్యిగా నిర్ణయించారు. కనిష్ఠంగా 20 నుంచి గరిష్ఠంగా 30 శాతం పెంచారు. దీంతో పాటు స్టాంపు డ్యూటీ విలువ, రిజిస్ట్రేషన్ల రుసుంలను కూడా ప్రభుత్వం పెంచింది.


అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల ఛార్జీలను 2021 జులైలో పెంచడమే తొలిసారి. తాజాగా ఏడు నెలల వ్యవధిలోనే రెండోసారి పెంచుతున్నారు. ఏడేళ్ల అనంతరం గత ఏడాది దాదాపు 20 శాతం మేర వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మూల మార్కెట్‌ విలువలను సవరించింది. తాజాగా ఇంకోసారి పెంచనుంది. మార్కెట్‌ విలువ, వ్యవసాయేతర ఆస్తుల విలువల పెంపుపై గురువారం రిజిస్ట్రేషన్‌ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా రిజిస్ట్రార్లతో సుదీర్ఘంగా నిర్వహించిన సమావేశాల్లో మార్కెట్‌ విలువల్ని ఏ మేరకు సవరించాలన్న విషయమై చర్చలు జరిపారు. ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రతిపాదనలకు తుది రూపు ఇచ్చి ప్రభుత్వానికి అందజేయనున్నారు.