Governor Tamilisai: తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు యశోద ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ తమిళి సై  సౌందరరాజన్ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గవర్నర్ సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం, లేఖ పంపించారు. సీఎం కేసీఆర్ సంపూర్ణారోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు లేఖలో గవర్నర్‌ తెలిపారు. కేసీఆర్‌ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారన్న విషయం తెలిసి ఆందోళన చెందానని గవర్నర్ తెలిపారు.


సీఎం కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత


సీఎం కేసీఆర్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో పాటు ఎడమచేయి, కాలు నొప్పిగా ఉనన కారణంగా వైద్యుల సూచనతో  సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చారు సీఎం కేసీఆర్. వైద్యుల సీఎం కేసీఆర్ కు వైద్య పరీక్షలు చేశారు. అన్ని ఫలితాలు సాధారణంగా ఉన్నాయని, కేసీఆర్‌ ఆరోగ్యం బాగుందని వైద్యులు వెల్లడించారు. ఆయనకు వారం రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు. 


వైద్యులు ఏమన్నారంటే?


ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR Health Bulletin) ఆరోగ్యం గురించి యశోద (Yashoda) ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ విషు రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సీఎం గారు రెండ్రోజుల నుంచి నీరసంగా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి ఎడమ చేయి కాస్త లాగుతుందని అన్నారు. దీంతో మేం హాస్పిటల్‌కి రావాలని సూచించారు. డాక్టర్ ఎంవీ రావు, చీఫ్ కార్డియాలజిస్ట్ ప్రమోద్ గారు చూసుకుంటున్నారు’’ అన్నారు. చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సీఎం మాకు ఫోన్ చేయగానే, మేం ఆయన ఇంటికి వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేశాం. ఆయనకు ఆస్పత్రికి వచ్చి యాంజియోగ్రామ్ చేయాలని సూచించాం. లక్కీగా గుండెలోని రక్త నాళాల్లో ఎలాంటి బ్లాక్స్ గానీ, సమస్యలు గానీ లేవు. ఎడమ చెయ్యి ఎందుకు లాగుతుందని ఇతర పరీక్షలు కూడా చేశాం. మెదడుకు సంబంధించి ఏవైనా సమస్యలు కూడా ఉన్నాయేమో పరిశీలించాం. అన్ని పరీక్షలు చేసి మా డాక్టర్లమంతా కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ కంక్లూజన్‌కి వచ్చాం.’’ అని ప్రమోద్ కుమార్ అన్నారు.


బ్రెయిన్, వెన్నెముక ఎమ్మారై నార్మల్‌గానే 


డాక్టర్ ఎంవీ రావు మాట్లాడుతూ ‘‘నీరసంగా ఉందని శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో సీఎం నాకు ఫోన్ చేశారు. వెంటనే ఆయన ఇంటికి వెళ్లి పరీక్షించాం. ప్రతి ఏటా టెస్టులు చేస్తుంటాం. అలాగే ఇప్పుడు కూడా రమ్మన్నాం. ప్రివెంటివ్ చెకప్‌లో భాగంగా రక్త పరీక్షలు, కరోనరీ యాంజియోగ్రాం (Coronary Angiogram), ఎంఆర్ఐ స్పైన్ (Spine MRI), ఎంఆర్ఐ బ్రెయిన్ (Brain MRI) కూడా చేశాం. యాంజియోగ్రాం చాలా నార్మల్‌గా ఉంది. ఆయనకి కార్డియాక్ ప్రాబ్లం ఏం లేదు. ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా నార్మల్‌గా ఉంది. సర్వికైల్ స్పైన్‌లో కొంచెం స్పాండిలోసిస్ ఉంది. ఇది వయసుతో పాటు వస్తుంది. సీఎం గారు ఎప్పుడూ వార్తా పత్రికలు, ఐపాడ్ చూస్తుంటారు.. కాబట్టి, మెడ నొప్పి వల్ల ఎడమ చెయ్యి నొప్పి వచ్చిందని నిర్ధారించాం. న్యూరో ఫిజీషియన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏటా చేసే పరీక్షలన్నింటిలో కూడా ఏ సమస్యా లేదు. 


బీపీ, షుగర్ కంట్రోల్ చేసుకోవాలని సూచించాం


సీఎంకు బీపీ, షుగర్ ఉన్నాయి. అవి నార్మల్‌గానే ఉన్నాయి. మిగతా పరీక్షల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. సీఎం గారి రక్త పరీక్షల్లో భాగంగా హిమోగ్లోబిన్ శాతం, మూత్రపిండాల పనితీరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని బాగున్నాయి. బీపీ, షుగర్ కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పాం. నీరసానికి కారణం ఏంటంటే.. ఈ మధ్య బిజీగా గడుపుతున్నారు. కాస్త విశ్రాంతి అవసరమని చెప్పాం. వారానికి ఒకసారి రక్త పరీక్షలు చేసి షుగర్ లెవెల్స్ చెక్ చేస్తుంటాం. వచ్చే ఏడాది చేసే పరీక్షలు యథాతథంగా చేస్తాం.’’