ఉక్రెయిన్‌పై రష్యా దాడుల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. యుద్దంపై తాత్కాలిక విరామం అంటూనే రష్యా బలగాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై బాంబు దాడులు చేపడుతున్న రష్యా.. సైనిక, వైమానిక స్థావరాలతో పాటు ప్రధాన నగరాలపై దాడులకు పాల్పడుతోంది. 



ఉక్రెయిన్‌పై స్పెషల్ ఆపరేషన్ చేస్తామన్న పుతిన్ !


ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేస్తామని పుతిన్‌ వార్నింగ్‌ జారీ చేశారు. ఉక్రెయన్‌పై స్పెష‌ల్ ఆప‌రేష‌న్ చేప‌ట్ట‌నున్న‌ట్లు పుతిన్ ప్ర‌క‌టించాడు.  . రష్యా బలగాల దాడిలో ఉక్రెయిన్‌ అల్లకల్లోలంగా మారిపోయింది. ఇప్పుడప్పుడే కోలుకోలేనంత దారుణంగా దెబ్బతింది. ఒకపక్క వైమానిక క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న రష్యా ఉక్రెయిన్‌లోని నగరాలను స్వాధీనం చేసుకుంటూ పోతుంది. ఇందులో భాగంగానే రష్యా బలగాలు దక్షిణ ఉక్రెయిన్‌లోని మెట్రోపోల్‌ నగరాన్ని స్వాధీనం చేసుకోవడమే కాక ఆ నగర మేయర్‌ని కూడా కిడ్నాప్‌ చేసినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ వెల్లడించారు.  సుమారు 10 మంది ఆక్రమణదారుల బృందం మెట్రోపోల్‌ మేయర్‌ ఇవాన్‌ ఫెడోరోవ్‌ను కిడ్నాప్‌ చేసిందని ఉక్రెయిన్‌ పార్లమెంట్‌ ట్విట్టర్‌లో పేర్కొంది.


రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే యోచనలో అమెరికా !


రష్యాపై అ‍మెరికా మరిన్ని ఆంక్షలు విధించి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది.  తాజాగా ర‌ష్యా నుంచి సీఫుడ్‌, వొడ్కా, డైమండ్స్ దిగుమ‌తిపై నిషేధం విధిస్తున్న‌ట్లు బైడెన్ తెలిపారు. ప‌లు ర‌కాల వ‌స్తువుల దిగుమ‌తిపై నిషేధం అమ‌ల్లోకి తెస్తూ  ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. జీ-7 దేశాలు, యూరోపియన్‌ యూనియన్‌లోని దేశాలు రష్యాకు ఉన్న మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ అనే హోదాను తొలగించాయి. ఈ నేపథ‍్యంలో రష్యా దిగుమతులపై భారీగా ట్యాక్స్‌లు పెరిగే అవకాశం ఉంది. దీంతో రష్యాలో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉంది. 






ఉక్రెయిన్‌పై జీవాయుధాలు ప్రయోగిస్తే ఊరుకునేది లేదన్న జో బైడెన్ ! 


ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తాజాగా హెచ్చరించారు.  నాటో, రష్యా ముఖాముఖి తలపడితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని శుక్రవారం హెచ్చరించారు. దాన్ని నివారించేందుకు కృషి చేస్తామన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా విజయం అసాధ్యమన్నారు.


రష్యా సైనికుల తల్లులకు జెలెన్‌ స్కీ వీడియో సందేశం 


ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ మరో కీలక ప్రకటన చేశారుఉ. తమ కుమారులను ఉక్రెయిన్‌లో యుద్ధానికి పంపకుండా అడ్డుకోవాలని రష్యా సైనికుల తల్లులకు సూచిస్తూ శనివారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. జెలెన్ స్కీ సతీమణి కూడా ఇలాంటి వీడియోనే విడుదల చేశారు.