Kurnool Treasure Hunters: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం రాజుల మండగిరి గ్రామంలో  పురాతన దేవాలయం బుగ్గల అమ్మ దేవతామూర్తి సమాధులను గుప్తనిధుల(Treasury) కోసం తవ్వేశారు దుండగులు. ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు పురాతన కట్టడాలను, చారిత్రక సంపదను ధ్వంసం చేస్తున్నారు. రాజుల కాలం నాటి కట్టడాలు కింద నిధులు ఉన్నాయన్న నమ్మకంతో వాటిని సర్వ నాశనం చేస్తున్నారు. రాజుల మండగిరి ప్రాంతం ఒక చారిత్రక ప్రదేశం(Historic Place). ఇందుకు సజీవ సాక్ష్యంగా రామలింగేశ్వరస్వామి దేవాలయం, ఇతర కట్టడాలు కనిపిస్తాయి. ఇందులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శివాలయం విజయనగర రాజులు నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రాంతం పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ దీనిని ప్రజలు ఆరోపిస్తున్నారు.


ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలపై వేటగాళ్ల(Treasure Hunters) కన్ను 


అయితే వీటి సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడంతో దుండగుల కన్ను వీటిపై పడింది. ఇప్పటికే చాలా కట్టడాలు కనుమరుగయ్యాయి. మరి కొన్నింటిని కొందరు స్వార్థపరులు గుప్తనిధుల కోసం నిలువునా ధ్వంసం చేస్తున్నారు. ఇందులో పత్తికొండ మండలం రాజుల మండగిరి గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ పదుల సంఖ్యలో ఆలయాలు ఇప్పటికే కనిపించకుండా పోయాయి. అయితే ఇప్పుడు వేటగాళ్ల దృష్టి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలపై పడింది. విజయనగర రాజుల(Vizianagara Kings) కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికే చాలావరకు ఆక్రమణకు గురైంది. తాజాగా గుప్తనిధుల వేటగాళ్లు ఈ ఆలయాన్ని కూడా ధ్వంసం చేసే సాహసం చేస్తున్నారు.


విజయనగర రాజుల కాలం నాటి ఆలయాలు


విజయనగర రాజుల కాలంలో నిర్మించిన రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. గతంలో కూడా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారని గ్రామస్థులు అంటున్నారు. అయినా అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో తాజా ఘటన అర్థంపడుతోంది. ఇలాంటి ఆలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉందని గ్రామస్థులు అంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన వెనక ఎవరో ఉన్నారన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, మరెప్పుడు గుప్తనిధుల తవ్వకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని కోరుతున్నారు. 


గతంలోనూ ఇలాంటి ఘటనలు 


కర్నూలు జిల్లాలో గుప్త నిధుల కోసం వేటగాళ్లు పురాతన ఆలయాలను టార్గెట్ చేసిన ఘటనలు గతంలోనూ వెలుగుచూశాయి. నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధుల వేట ఎక్కువగా జరుగుతుంటుంది. నల్లమల అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు జరుపుతుంటారు. గుప్త నిధుల పేరిట చాలా మంది అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు. గుప్తనిధుల పేరిట మోసపోవద్దని సూచించారు.