రాష్ట్ర ప్రభుత్వ పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్య( విజయ డెయిరీ) విస్తరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కొన్నేళ్లుగా డైరీ కార్యకలాపాలు పెద్ద ఎత్తున హైదరాబాద్ కేంద్రంగానే కొనసాగుతున్నాయి. పాల సేకరణ తర్వాత హైదరాబాద్ కు రవాణా చేయడం, ఉత్పత్తుల తయారీ అనంతరం తిరిగి జిల్లాలకు పంపడం చేస్తున్నారు. దీంతో రవాణా, ఇతర సమస్యలను ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో డైరీ కార్యకలాపాలను 6 జోన్లుగా విభజించి వికేంద్రీకరణ విధానంలో సాగాలని భావిస్తుంది. తద్వారా పాల సేకరణ నుంచి ఉత్పత్తుల తయారీ వరకు డైరీ సామర్థ్యాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో 64 ఉన్న విజయ డైరీ దుకాణాలు ఇప్పుడు 650 కి పెరిగాయి. వీటిని మరింతగా 1000కి పెంచాలని భావిస్తుంది.
విజయ డైరీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
విజయ డైరీ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇటీవల మంత్రి సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి విస్తరణ ప్రతిపాదనలపై చర్చించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ లుల్లో కొత్త జోన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జోన్ల కేంద్రంగా పాల సేకరణ చేపడతారు. అక్కడే ఉత్పత్తి యూనిట్లు ప్రారంభిస్తారు. జోన్ల ఆధ్వర్యంలో మార్కెటింగ్ చేపడతారు.
త్వరలో మెగా డైరీ ప్లాంట్లు
రోజుకు 5 నుంచి 8 లక్షల ప్రాసెసింగ్ సామర్థ్యంతో రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 42 ఎకరాల్లో 250 కోట్లతో విజయ డైరీ మెగా ప్లాంట్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ కాలంలోనే విస్తరణ ప్రతిపాదనలను సైతం సిద్ధం చేశారు. విజయ డైరీ కోసం రాష్ట్రవ్యాప్తంగా పాల సహకార సంఘాల ద్వారా 4.5 లక్షల లీటర్ల ను సేకరిస్తుంది. పాలతో పాటు పాల ఆధారిత వివిధ ఉత్పత్తులను తయారుచేసి సొంత దుకాణాల ద్వారా విక్రయిస్తుంది. కొత్తగా విజయ ఐస్ క్రీమ్ తయారీ కి సిద్ధమవుతోంది.
దేశంలో వ్యవసాయం తర్వాత వాడు పరిశ్రమరంగంపై అత్యధిక కుటుంబాలు జీవనోపాదం పొందుతున్నాయని మంత్రి తలసాని వెల్లడించారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న 35, 500 అంగన్వాడీ కేంద్రాలకు విజయ డైరీ ఆధ్వర్యంలో పాల సరఫరాకు సంబంధించి మహిళ, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి కలిసి విధి విధానాలపై ఇటీవల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ రంగంలోని విజయ తెలంగాణ డైరీ కార్పొరేట్ డైరీలకు దీటుగా మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడం ద్వారా ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. విజయ డైరీ ద్వారా వివిధ ప్రభుత్వ సంస్థలకు పాల సరఫరా చేయడమే కాకుండా ఐసిడిఎస్ సెంటర్లకు కావాల్సిన 20 లక్షల లీటర్ల పాలను సరఫరా చేయడానికి అవసరమైన కార్యచరణ రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఐసిడిఎస్ కేంద్రాలకు అవసరమైన పాలలో 5.5 లక్షల లీటర్ల పాలను విజయ డైరీ సరఫరా చేస్తుందని, అవసరమైన సిబ్బందిని నియమించేందుకు, పాల సేకరణకు కావలసిన సామర్థ్యాన్ని విజయ డైరీ సమకూర్చుకుంటుందని మంత్రి తెలిపారు.