రోజుకో ఆపిల్ పండు తినడం వల్ల వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెబుతారు. ఎందుకంటే ఆపిల్ తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఆపిల్‌లో పుష్కలంగా ఉంటాయి. పిల్లలు, పెద్దలూ ఇద్దరూ... రోజూ యాపిల్ తినాల్సిన అవసరం ఉంది. మనం తినే ఆహారాల్లో దీన్ని కూడా భాగం చేసుకోవాలి.ఈ పండ్లను సంపూర్ణ ఆహారంగా చెబుతారు వైద్యులు. యాపిల్ పండ్లను ఎప్పుడు పడితే అప్పుడు తినేవారు ఉన్నారు. కానీ రాత్రిపూట తక్కువగా తినాలని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు యాపిల్ పండును రాత్రి పూట తినకూడదు. ఆపిల్ పండ్లు తినడం వల్ల రాత్రి పూట అవి సరిగా జీర్ణం కావు. దీని వల్ల మరింతగా సమస్యలు పెరిగిపోతాయి. జీర్ణ వ్యవస్థ పనులకు ఆటంకం కలిగిస్తుంది ఆపిల్ పండు. కాబట్టి రాత్రి పూట తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడైనా వీటిని తినవచ్చు. 


రాత్రిపూట తింటే మలబద్ధకాన్ని, గ్యాస్టిక్ సమస్యలను పెంచే  ఆపిల్... ఉదయం పూట తింటే మాత్రం ఆ సమస్యలను తగ్గిస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు కూడా ఆపిల్ పండ్లను రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఈ పండ్లు తింటే పొట్ట నిండిన భావన త్వరగా కలుగుతుంది. కాబట్టి ఇతర ఆహారాలను తినడం తగ్గిస్తారు. అలా ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. అలాగే మధుమేహం ఉన్న వారు ప్రతి రోజూ ఆపిల్ పండు తినడం అలవాటు చేసుకోవాలి. ఆపిల్ పండ్లు ఎన్ని తిన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనివల్ల డయాబెటిస్ పెరగకుండా అదుపులో ఉంటుంది. రక్త హీనత సమస్యతో బాధపడుతున్నవారు కూడా యాపిల్ పండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఈ పండ్లను తినడం వల్ల రక్తం అధికంగా ఉత్పత్తి అవుతుంది. రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. కాబట్టి మహిళలు, పిల్లలు కచ్చితంగా రోజుకో ఆపిల్ పండు తినాలి. 


గుండె ఆరోగ్యానికి యాపిల్ పండ్లు చాలా మంచివి. గుండె పోటు రాకుండా అడ్డుకుంటుంది. యాపిల్ పండ్ల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి  హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. ఆరోగ్యం బాగోలేనప్పుడు యాపిల్ ను మించిన సంపూర్ణ ఆహారం లేదు. జ్వరం వచ్చినప్పుడు రోజుకు రెండు పండ్లు తింటే జ్వరం నుంచి త్వరగా కోలుకుంటారు. శరీరం నీరసించకుండా శక్తి వంతంగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ ఒక యాపిల్ పండు తినడం అలవాటుగా మార్చుకోవాలి. అలాగే మధ్యాహ్నం భోజనం తిన్నాక ఒక గంట గ్యాప్ ఇచ్చి యాపిల్ పండు తినాలి. రోజూ ఈ పండ్లు తినేవారి చర్మం కూడా మెరుపు సంతరించుకుంటుంది. సాయంత్రం దాటాక మాత్రం ఆపిల్ పండ్లు తినడం మానేయాలి. జీర్ణ సమస్యలు, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రవుతున్న కొద్దీ జీర్ణ వ్యవస్థ నెమ్మదిగా పనిచేస్తుంది. 


Also read: ఆహారంలో ఉప్పు పూర్తిగా మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.