Nara Lokesh: బుధవారం (అక్టోబర్ 4) ఉదయం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విజయవాడకు రానున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు నారా లోకేశ్ హాజరు కానున్నారు. ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో సీఆర్‌పీసీ 41ఏ  కింద ఢిల్లీలో నారా లోకేశ్ కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీలో రాష్ట్రపతి, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధుల దృష్టికి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశాన్ని నారా లోకేశ్ తీసుకెళ్లారు. 


అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేరును సీఐడీ సెప్టెంబర్ 26న చేర్చింది. లోకేశ్ పేరును ఏ - 14గా సీఐడీ చేర్చింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్‌ను దక్షిణం వైపున మార్చి లబ్ధి పొందారని సీఐడీ ఆరోపిస్తోంది. హెరిటేజ్ ఆస్తులు పెంచుకోవడం కోసం ఈ అలైన్‌మెంట్ మార్చారని ఆరోపిస్తున్నారు.


నేడే సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ నేడు(అక్టోబరు 3) విచారణకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో మాజీ సీఎం చంద్రబాబును కూడా నిందితుడిగా పేర్కొని అరెస్టు కూడా చేశారు. అయితే, తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ను గత నెల మూడో వారంలో దాఖలు చేశారు. ఇది నేడు (అక్టోబరు 3) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుద్ధా బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం ముందుకు రానుందని ‘లైవ్ లా’ ట్వీట్ చేసింది.


గత నెల మూడో వారం చివరిలో దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ విచారణ వివిధ కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. తొలుత సెప్టెంబరు 26న ఈ పిటిషన్ విచారణ చేయాల్సి ఉండగా.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో క్యురేటివ్ పిటిషన్‌లపై స్పెషల్ బెంచ్ సమావేశం అయినందున ఆ రోజు లిస్ట్ అయిన పిటిషన్ల విచారణ వాయిదా పడింది. అందులో చంద్రబాబు పిటిషన్ కూడా ఉండడంతో సెప్టెంబరు 27 కి వాయిదా పడింది.


విచారణకు విముఖత చూపిన జడ్జి


సెప్టెంబరు 27న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి (బెంచ్) బదిలీ చేశారు. దీంతో పిటిషన్ విచారణ అక్టోబరు 3కి వాయిదా పడింది. ఆ రోజు తొలుత ఈ పిటిషన్ త్రిసభ్య ధర్మాసనం ముందుకు రాగా, వారిలో ఓ న్యాయమూర్తి ఈ కేసు వినేందుకు సుముఖత చూపలేదు. ‘నాట్ బిఫోర్ మీ’ అని చెప్పడంతో మరో బెంచ్ కు బదిలీ చేయాల్సి వచ్చింది. త్రిసభ్య ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, రెండో న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ఉన్నారు. జస్టిస్ భట్ ఈ పిటిషన్ విచారణకు నిరాకరించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ... ‘‘మై బ్రదర్ జస్టిస్ ఎస్వీఎన్ భట్టికి ఈ పిటిషన్ విచారణపై కొన్ని అంతరాలు ఉన్నాయి. మిస్టర్ హరీష్ సాల్వే మేం ఈ పిటిషన్‌ని మరో బెంచ్ కి బదిలీ (పాస్ ఓవర్) చేస్తాము’’ అని అన్నారు.