సీఎం జగన్, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత బండారు సత్యనారాయణను పోలీసులు సోమవారం రాత్రి (అక్టోబరు 2) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బండారు సత్యనారాయణ ఇంటిని ఆదివారం రాత్రే చుట్టుముట్టిన గుంటూరు పోలీసులు.. అరెస్టు చేసి సోమవారం రాత్రి గుంటూరుకు తరలించారు. విశాఖ జిల్లా పరవాడలో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు 41A, 41B నోటీసులిచ్చి అరెస్టు చేశారు. బండారు సత్యనారాయణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ను దూషించారని ఒక కేసు నమోదు కాగా, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి.. గుంటూరులోని అరండల్‌పేట, నగరపాలెంలో పీఎస్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. అరెస్టు తర్వాత బండారు సత్యనారాయణను గుంటూరు నగరపాలెం పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు.


నగరపాలెం పోలీస్ స్టేషన్లో ఉన్న బండారు సత్యన్నారాయణను పోలీసులు నేడు (అక్టోబరు 3) మధ్యాహ్నం తర్వాత కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, గుంటూరు నగరంపాలెం పీఎస్‌లో బండారు సత్యనారాయణపై 153ఏ, 354ఏ, 504, 505, 506, 509, 499 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 153ఏ – సమాజంలో వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం., 354ఏ-లైగింక వేధింపులు, సెక్సువల్ ఆరోపణలు చేయడం, 504-ఉద్దేశపూర్వకంగా ఇతరులను కించపరచడం, 505-అల్లర్లు సృష్టించే విధంగా వ్యాఖ్యలు చేయడం, 506-నేరపూరిత ఉద్దేశంతో ఇతరులను బెదిరించడం, 509-మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం, 499-ఇతరులను ఉద్దేశించి తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చిన వారిపై పరువు నష్టం దావా కింద అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.


టీడీపీ నేతలు ఫైర్
మరోవైపు, బండారు సత్యనారాయణ అరెస్టుపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 41A ఇచ్చిన వెంటనే 41B ఎలా ఇస్తారని టీడీపీ లీగల్ సెల్ అభ్యంతరం తెలిపింది. టీడీపీ మాజీ మంత్రి బండారు బెయిల్ పిటిషన్‌ను ఆయన న్యాయవాదులు సిద్దం చేశారు. మరోవైపు హైకోర్టులో నిన్న వేసిన హౌజ్ మోషన్ పిటిషన్.. రెగ్యులర్ కోర్టులో ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిన్న హౌస్ మోషన్ పిటిషన్ విచారించే సమయానికి 41A నోటీస్ ఇచ్చారన్న సమాచారంతో ఈరోజు విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక వాదనలు జరగనున్నాయి.