బోనీ కపూర్... శ్రీదేవి మరణం గురించి చెబుతూ కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో ఆమె ఉప్పు చాలా తక్కువగా తినేదని దీనివల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొందని చెప్పారు. ఉప్పు చాలా వరకు తగ్గించడం వల్ల లోబీపీతో ఆమె చాలాసార్లు కింద పడిపోయేదని కూడా వివరించారు. దీన్ని బట్టి ఉప్పు తినడం ఎంత ముఖ్యమో అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఉప్పును తగ్గించి తినడం మంచిదే, కానీ పూర్తిగా మానేయడం మాత్రం చాలా అనారోగ్యకరం. ఉప్పు వేయనిదే ఏ వంటకం కూడా పూర్తికాదు. రుచి కూడా ఉండదు. అయినా కూడా ఎంతోమంది సన్నగా ఉండాలన్న తాపత్రయంతో ఉప్పును పూర్తిగా మానేస్తున్నారు. దీని వల్ల బీపీ తగ్గిపోయి కింద పడిపోతున్నారు. ఇలా ఉప్పు మానేయడం వల్ల ఎన్నో అనర్ధాలు ఉన్నాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.


మన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో ఉప్పు ప్రధానమైనది. మన శరీరానికి సరిపడా ఉప్పును తింటే కండరాల్లో కదలికలు బాగుంటాయి. నాడుల్లో సమాచార ప్రసారం చక్కగా జరుగుతుంది. జీవక్రియ కూడా చక్కగా ఉంటుంది. ఉప్పంటే సోడియం క్లోరైడ్. దీంట్లో 39% సోడియం, 61% క్లోరిన్ ఉంటాయి. అందుకే సోడియం క్లోరైడ్‌ను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు మన శరీరంలోకి చేరాక సోడియం క్లోరైడ్ అయాన్స్‌‌గా విడిపోతాయి. ఇక సోడియం కణాలలోని ద్రవాలను పెరగకుండా, తగ్గకుండా నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్లే నాడులు, కండరాలు చక్కగా పనిచేస్తాయి. ఉప్పు తినడం మానేస్తే కణాల లోపల ఒత్తిడి పెరిగిపోతుంది. దీనివల్ల వాటి లోని ద్రవాల్లో సమతుల్యం దెబ్బతింటుంది. దీనివల్ల కణాల్లో నీరు అధికంగా పేరుకుపోయి వాపు వస్తుంది. శరీరం అంతా ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది. పరిస్థితి బాగా విషమిస్తే ఆ కణాలు పగిలిపోయి ప్రాణాంతకంగా మారతాయి. కాబట్టి ఉప్పును ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధికంగా తీసుకోకుండా మితంగా తీసుకుంటే మంచిది.


శరీరంలో ఉప్పు తగ్గితే తల తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు కోమాలోకి కూడా వెళ్ళవచ్చు. కనుక ఉప్పు తినడం మానకూడదు. కాకపోతే ఎంత తినాలి అన్నది మితంగా నిర్ణయించుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం మన శరీరానికి రోజుకు రెండు గ్రాముల సోడియం అవసరం. రెండు గ్రాముల సోడియం మన శరీరానికి అందాలంటే మనం రోజు ఐదు గ్రాములు ఉప్పును తినాలి. అంటే ఒక టీ స్పూన్. కానీ చాలామంది రెండు, మూడు టీ స్పూన్ల ఉప్పును రోజూ తింటున్నారు. దీనివల్ల హై బీపీ వంటి సమస్యల బారిన పడుతున్నారు. అధికరక్తపోటు వల్ల గుండె జబ్బులు కూడా త్వరగా వస్తాయి. కాబట్టి ఉప్పును పూర్తిగా మానేయకుండా... అలాగని అతిగా తినకుండా జాగ్రత్త పడాలి. రోజుకు ఒక స్పూను మించకుండా తినడం మంచిది.





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.