Ganesh Immersion In Hyderabad: గణేష్ నిమజ్జనం విషయంలో తెలంగాణలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దన్న హైకోర్టు తీర్పుపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నిమజ్జనం విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. పీవోపీ విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వగా, దాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్‌ రేపు సీజేఐ ధర్మాసనం విచారించే అవకాశం ఉంది.


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమన్నారంటే..


గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే ఆంక్షల నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో గణేష్ నిమజ్జనంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉందన్నారు. ఇదివరకే తమ ప్రభుత్వం హైకోర్టు తీర్పును గౌరవిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సైతం చేస్తుందని, అయితే ఆంక్షలు తొలగిస్తే పూర్తి స్థాయిలో నిమజ్జన వేడుక సజావుగా జరుగుతుందన్నారు. ట్యాంక్ బండ్ సహా  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చిన్న సరస్సులు, చెరువులలో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని చెప్పారు.


Also Read: Ganesh Nimajjan: హైదరాబాద్‌లో నిమజ్జనంపై రంగంలోకి కేసీఆర్.. ఆ రెండు ప్లాన్‌లకు మొగ్గు!


హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కచ్చితంగా చేస్తామనటం కేవలం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అభిప్రాయం అని తెలిపారు. వారి అభిప్రాయంపై ఆగమేఘాల మీద ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. వినాయక చవితి, గణేష్ నిమజ్జనాలకు హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందని, ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిందని మంత్రి తలసాని వివరించారు.


Also Read: Revanth Reddy: తెలంగాణలో రేవంత్ రెడ్డి మెగా ప్లాన్! ఇప్పటికే అమల్లోకి.. సక్సెస్ అవుతుందా? 


భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ఇలా..
ఎట్టి పరిస్థితుల్లోనూ హుస్సేన్ సాగర్ లోనే నిమజ్జనం చేస్తామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి చెబుతోంది. గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్ల బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదే అంటున్నారు. నిమజ్జనాలు చేయకూడదని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని, కేవలం కొన్ని రకాల విగ్రహాలను నిమజ్జనం చేయాలని తీర్పిచ్చిందని గుర్తుచేశారు. ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచైనా సరే హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు చేయాలని సమితి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అనాదిగా వస్తున్న ఆచారాన్ని తాము కొనసాగిస్తున్నామని సమితి సభ్యులు చెప్పారు. జల్లికట్టు లాంటి పండుగలను సైతం కోర్టు తీర్పును కాదని నిర్వహిస్తుంటే, గణేష్ నిమజ్జనం చేయడానికి ఏ సమస్య లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు.


Also Read: గద్వాలలో కేటీఆర్ పర్యటన.. అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. విపక్ష నేతల ముందస్తు అరెస్టు