హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంపై ‘మా’ అధ్యక్షుడు నరేష్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ప్రమాదం జరిగి అంతా విషాదంలో ఇవేం మాటలంటూ పలువురు ఆయనపై మండిపడ్డారు. తేజ్ యాక్సిడెంట్ తర్వాత నరేష్ మాట్లాడుతూ.. ‘‘సాయి ధరమ్ తేజ్ నా బిడ్డలాంటివాడు. నా కొడుకు నవీన్, సాయి ఇద్దరూ మంచి స్నేహితులు. ప్రమాదం జరిగిన రోజు సాయంత్రం మా ఇంటి నుంచే బయలుదేరారు. బైక్ సౌండ్స్ విని వెళ్లేలోపే వారిద్దరూ బయల్దేరిపోయారు. బైక్ రైడింగ్ వద్దని తాను చాలాసార్లు సాయిని హెచ్చరించాను. అతను త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నన్నారు. బైక్ రైడింగ్ విషయంలో నాలుగు రోజుల క్రితం వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలనుకున్నా. పెళ్లి చేసుకోవాల్సిన వాళ్లు, మంచి కెరీర్ ఉన్నవాళ్లు ఇలా జీవితాన్ని ప్రమాదంలో పడేసుకోవడం మంచిదికాదు. సాయిని పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లాలనుకున్నా. కానీ ఐసీయూలో ఉన్నప్పుడు వెళ్లి ఇబ్బంది పెట్టడమెందుకని ఊరుకున్నా’’ అని తెలిపారు. అలాగే, ఆయన బైక్ యాక్సిడెంట్‌లో చనిపోయిన పలువురు పేర్లను కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. నరేష్ వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్, నటుడు శ్రీకాంత్ మండిపడ్డారు. 


బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘‘సాయి ధరమ్ తేజ్ తిరిగి షూటింగ్స్ చేస్తారు. బ్రహ్మండంగా ఉంటారు. చిన్న ప్రమాదమే జరిగింది. ఈ సమయంలో నరేష్ ప్రమాదవశాత్తు మరణించినవారి పేర్లు చెప్పడం కరెక్టు కాదు. రేసింగ్ చేశాడు.. అది చేశాడు.. ఇది చేశాడని ఇప్పుడెందుకు మాట్లాడటం? ఇలాంటి సమయంలో సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని పరమేశ్వరుడిని ప్రార్థించాలి’’ అని అన్నారు.  


శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘సాయి ధరమ్ తేజ్‌కు జరిగింది చాలా చిన్న యాక్సిడెంట్. సాధారణంగా జరిగే ప్రమాదమే. రోడ్డు మీద ఇసుక ఉండడంతో జారి పడిపోయాడు. ఆయన త్వరగా కోలుకుంటారు. కోలుకోవాలని ఆ దేవుడ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే దయచేసి ఎవరైనా వీడియో బైట్లు పెట్టేప్పుడు కొంచెం ఆలోచించి పెట్టండి. ఎందుకంటే నాకు తెలిసిన యంగ్ స్టర్స్‌లో సాయి ధరమ్ తేజ్ చాలా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తుంటాడు. తను ర్యాష్‌గా వెళ్లే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఈ టైమ్‌లో ఇలా మాట్లాడకూడదు. కుటుంబసభ్యులంతా టెన్షన్‌లో ఉన్నారు. మనం పెట్టే బైట్లు ఆ కుటుంబాన్ని ఇంకా టెన్షన్ పెడతాయి. నరేష్ గారు పెట్టిన బైట్.. అది కూడా ఈ టైమ్‌లో.. చనిపోయిన వాళ్ల గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. దయచేసి అలాంటి బైట్లు ఎవరూ పెట్టకూడదని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు. 


Also Read: తేజ్ ఇంకా అపస్మారక స్థితిలో ఉండటానికి కారణం ఇదేనా? వైద్యులు ఏమన్నారు?


శ్రీకాంత్ వ్యాఖ్యలపై నరేష్ తాజాగా మీడియాకు ఓ వీడియో పంపారు. నరేష్ మాట్లాడుతూ.. ‘‘నా బైట్(వీడియో వ్యాఖ్యలు) మీద నువ్వు ఇచ్చిన బైట్ చూశా. ఏంటమ్మా అలా ఇచ్చావ్ బైట్? ప్రమాదం సమయంలో సాయి ధరమ్ తేజ్ స్పీడ్‌లో లేడు. బురదలో జారి పడ్డాడు. నేను చెప్పినదానికి మీడియాలో తేడాగా వస్తే.. వెంటనే నేను ఏం చెప్పాలో అది చెప్పేశాను. చనిపోయినవాళ్ల గురించి నేను చెప్పలేదు. ఇండస్ట్రీ గురించి చెప్పాను. బైకులను చాక్లెట్లుగా ఇవ్వం. బైట్స్ ఇచ్చే ముందు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇండస్ట్రీలో జరిగిందే చెప్పాను. ప్రమాదాలు నాకూ జరిగాయి. చాలామందికి జరిగాయి. నువ్వు ఆ విధంగా మాట్లాడటం హర్ట్ చేసింది. నా కళ్ల ముందు నిన్ను హీరోగా రావడం చూశాను. మంచి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నావు. మా ఎన్నికల్లో పోటీ చేసి.. మా ప్యానెల్ మీద ఓడిపోయావు. దయచేసి అలాంటి బైట్స్ ఇవ్వొద్దు’’ అంటూ నరేష్ వ్యాఖ్యానించాడు. ‘మా’ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో.. వీరంతా సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్‌ను రాజకీయం చేస్తున్నారంటూ ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. నరేష్ తాజాగా వీడియో మళ్లీ చర్చనీయమైంది.