రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న సాయి ధరమ్ తేజ్.. వైద్యానికి స్పందిస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా తేజ్ నొప్పితో బాధపడుతున్న వీడియో బయటకు వచ్చింది. అయితే, తేజ్ పూర్తిగా కళ్లు తెరవలేదు. వైద్యుల మాటలకు స్పందిస్తున్నాడు. చేతి వేళ్లను కూడా కదిపాడు వైద్యులు కళ్లు తెరవమని చెప్పడాన్ని వీడియోలో చూడవచ్చు. అయితే, ఈ వీడియో ఇప్పటిది కాదని.. శుక్రవారం ప్రమాదం జరిగిన వెంటనే మెడికవర్ హాస్పిటల్‌లో తీసిన వీడియోగా తెలుస్తోంది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు.
తాజాగా అపోలో హాస్పిటల్ వైద్యులు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. డాక్టర్ అలోక్ రంజన్ టీమ్ తేజ్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అంతర్గతంగా ఎలాంటి బ్లీడింగ్ లేదు. మరో 24 గంటలు గడిచిన తర్వాతే తేజ్‌కు కాలర్ బోన్ సర్జరీ చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే, తేజ్ పూర్తిగా స్పృహలోకి రాలేదని తెలుస్తోంది. అయితే, తలకు గాయాలు లేకున్నా.. సాయి ధరమ్ తేజ్ ఇంకా అపస్మారక స్థితిలో ఉండటానికి గల కారణాలేమిటనే విషయం మీద సర్వత్రా ఆందోళన నెలకొంది. సాధారణంగా తలకు గాయాలైతేనే ఈ పరిస్థితి నెలకొంటుంది. అయితే, వైద్యులు తేజ్‌కు ఎలాంటి అంతర్గత బ్లీడింగ్ లేకపోయినా ఎందుకు కోలుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితిపై వైద్యులు స్పందిస్తూ.. ప్రమాదం తర్వాత పస్మారక స్థితికి చేరకోవడానికి అనేక కారణాలు ఉంటాయని తెలుపుతున్నారు.
గోల్డెన్ హవర్‌లో తీసుకురావడం వల్లే తేజ్‌కు ప్రాణాపాయం తప్పిందా?: సాధారణంగా చాలామందికి గోల్డెన్ హవర్ గురించి తెలీదు. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా గాయపడితే గంట లోపు హాస్పిటల్‌కు తరలించాలి. దాని వల్ల వైద్యులు గాయాలకు చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం తేజ్‌ను కూడా గంట లోపు హాస్పిటల్‌కు తీసుకెళ్లడం వల్లే ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాద సమయంలో తేజ్ హెల్మెంట్ ధరించినా.. వేగంగా రోడ్డును తాకడం వల్ల తలలో మెదడు కదిలి అపస్మారక స్థితికి చేరుకున్నట్లు వైద్యులు భావిస్తున్నారు.
తలకు గాయాలు లేకపోయినా.. స్పృహ ఎందుకు కోల్పోయాడు: ప్రమాదం తర్వాత తేజ్ సగం మాత్రమే స్పృహలో ఉన్నాడు. ఆ సమయంలో తేజ్‌కు మాటలు వినిపించినా.. కళ్లు తెరిచి సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాడని.. అతడికి అత్యవసర చికిత్స అందించిన మెడికవర్ వైద్యులు తెలిపారు. ఆన్‌లైన్‌లో లీకైన వీడియోలో సాయి ధరమ్ తేజ్ నొప్పితో బాధపడుతూ చేతి వేళ్లను కదపుతున్న వీడియో.. మెడికవర్‌లో తీసిన వీడియోనే. ఆ సమయంలో వైద్యులు జీసీఎస్ స్కోర్ పరిశీలిస్తున్నారు. అంటే.. ప్రమాదం తర్వాత బాధితుడు ఏ స్థితిలో ఉన్నాడు. ఎలాంటి చికిత్స అసవరం అవుతుందో తెలుసుకొనేందుకు ఈ పరీక్ష చేస్తారు. బాధితుడు సాధారణ పరిస్థితిలో ఉండి.. కళ్లు తెరిచి, వైద్యుల మాటలకు స్పందిస్తే 15/15 స్కోర్ వేస్తారని వైద్యులు తెలిపారు. అయితే, తేజ్ హాస్పిటల్‌కు వచ్చే సరికే సగం అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిసింది. ఊపిరి పీల్చుకోలేని స్థితిలో ఉండటంతో తేజ్‌కు 7/15 స్కోరైనట్లు చెప్పారు. ఆ వెంటనే వెంటిలేటర్ ద్వారా శ్వాస అందించి వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
ప్రమాదం తర్వాత ఫిట్స్: మంచి హెల్మెట్ ధరించడం వల్ల తేజ్ తలకు గాయాలైతే కాలేదు. కానీ, ప్రమాదంలో కిందపడి హెల్మెట్‌తో సహా తల బలంగా రోడ్డును తాకడం వల్ల తేజ్ మెదడు కదిలి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు. ఫలితం అతడికి వెంటనే ఫిట్స్ వచ్చాయని, హాస్పిటల్‌కు తీసుకొచ్చిన తర్వాత ఫిట్స్ రాకుండా చికిత్స అందించామని తెలిపారు. ఇలా గాయాలు లేకుండా స్పృహ కోల్పోయే పరిస్థితి సెరిబ్రల్ షాక్ అంటారని తెలిపారు. బ్రెయిన్ అకస్మాత్తుగా కదలడం వల్ల ఇలా జరుగుతుందన్నారు. అయితే, ఈ సమస్యను స్కానింగ్, ఎంఆర్‌ఐల్లో కూడా గుర్తుపెట్టలేమని వివరించారు. మళ్లీ స్పృహలోకి రావాలంటే న్యూరాలజిస్టులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సి ఉంటుందన్నారు. తేజ్ పూర్తిగా స్పృహలోకి మాట్లాడేందుకు మరికొన్ని గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.